Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఉద్యోగం వదిలేస్తా..

ఉద్యోగం వదిలేస్తా..

అక్రమమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే..
పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
బండి సంజయ్ ఆరోపణలపై సీపీ అభ్యంతరాలు..
ఈ మాటలన్నీ ఇన్నాళ్లెందుకు అనలేదని ప్రశ్న..
సామాన్య ప్రజలకు తానేంటో తెలుసని వ్యాఖ్య
ఎంపీ లాగా పరువు నష్టం దావా వేయనని ప్రకటన..
స్పాట్ వాయిస్, హన్మకొండ క్రైమ్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై వ‌రంగ‌ల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కౌంటర్ ఇచ్చారు. తనను ల‌క్ష్యంగా చేసుకుని బండి సంజ‌య్ నింద‌లు మోపారన్నారు. సీపీ అక్రమాల చిట్టా బయటపెడుతా.., తన బండారం తేలుస్తానని బండి సంజయ్ చేసిన ఆరోపణల మేరకు సీపీ ఏవీ రంగనాథ్ మంగళవారం సాయంత్రం కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. తాను గతంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పనిచేసినప్పుడు ఏదేదో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేశానని ఎంపీ సంజయ్ అంటున్నారని, అవే మాటలు ఇన్నాళ్లు ఎందుకు మాట్లాడలేదన్నారు. గతంలో తాను పనిచేసిన చోటల్లా అన్ని పార్టీల నేతల అరెస్టులు జరిగాయని, ఆయా సందర్భాల్లో లేని ఆరోపణలు ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చిందని బండి ని సీపీ ప్రశ్నించారు.
ప్రజలకు బాగా తెలుసు..
ప్రత్యక్షంగా సామాన్యులతో సంబంధాలు కలిగి ఉండే తాను ఏంటో ప్రజలందరికీ తెలుసని సీపీ తెలిపారు. తానెవరి పక్షాన ఉండనని, న్యాయం పక్షాన్నే నిలుస్తాననే విషయం తెలిసే ఖమ్మం, కొత్తగూడెం ప్రజలు ఎప్పటికీ గుర్తు చేస్తారన్నారు. బండి సంజయ్ ను తన బాధితులు కలిశారని కొన్ని మీడియాల్లో చూశానని, ఆ మాటకొస్తే తన వల్ల బాధపడింది కేవలం రౌడీషీటర్లు, భూకబ్జాదారులు, పీడీ యాక్ట్ కేసులు నమోదైన వారే సంజయ్ ను కలిసి ఉంటారని చమత్కరించారు. అన్యాయం జరిగిన ప్రజల వెంటే తానెప్పుడూ ఉంటానని, ఆ విషయం తను పనిచేసిన జిల్లాల్లోని ప్రజలను అడిగితే తెలుస్తుందని సూచించారు.
నవ్వాలా.. ఏడ్వాలా..
సెటిల్‌మెంట్స్, దందాలు చేశానని బండి సంజ‌య్ అన్నారని, ఆ మాట‌లు విన్నాక న‌వ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదని, ఆ మాటకొస్తే పదో తరగతి పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఇరుక్కున్నామనే ఫ్రస్ట్రేషన్ లోనే బీజేపీ నేతలు నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని సీపీ అన్నారు. స‌త్యంబాబు కేసుతో తనకే సంబంధం లేదని, ఆ కేసును విచారించింది ఇతర అధికారులే గానీ తాను కాదన్నారు. ఆ కేసు వివరాలు బండి సంజయ్ కు తెలియకపోవడం దారుణం అన్నారు. బండి సంజయ్ తనను పదేపదే ప్రమాణం చేయాలని అంటున్నారని, తామంతా ప్రమాణం చేసే ఉద్యోగంలోకి వస్తామనే విషయాన్ని గమనిస్తే బాగుంటుందని సీపీ గుర్తు చేశారు.
ఈటలను గౌరవంగా పంపించాం..
తామెప్పుడు కేసుల్లో విశ్వస‌నీయ‌త‌ను డెవ‌ల‌ప్ చేసుకుంటామని సీపీ తెలిపారు. ఆ మాటకొస్తే ఎమ్మెల్యే ఈట‌లను గౌర‌వంగా విచారించి, ఆధారాలు తీసుకుని, స్టేట్‌మెంట్ రికార్డు చేసి పంపించామనే విషయాన్ని గమనించాలన్నారు. టెన్త్ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఆధారాలు తీసుకుంటామని, ఇంకా ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలోనే ఉన్నామని సీపీ రంగ‌నాథ్ తెలిపారు. కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తాం ప్రకటించారు. అయినా, నిందితులుగా ఉన్నవారు ఆరోపణలు చేయడం సర్వసాధారణమని, దర్యాప్తును రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. బండి సంజయ్ తో తనకేమైనా గట్టు పంచాయితీ లేదు కదా అన్నారు. సంజయ్ ఫోన్ తమ వద్దకు రాలేదని, రాత్రి 1.14 గంటలకు లాస్ట్ కాల్ ఉందని, లాస్ట్ లొకేషన్ బెజ్జంకి అని చూపుతోందన్నారు. తమ వద్ద అన్ని ఆధారాలున్నాయన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments