బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి అరెస్ట్..
బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు
కరీంనగర్ లో ఉద్రికత్త..
స్పాట్ వాయిస్, కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి సమయంలో కరీంనగర్ ఏసీపీ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు సంజయ్ అత్తమ్మ వాళ్ల ఇంటికి చేరుకున్నారు. సంజయ్ అత్తమ్మ ఇటీవల చనిపోగా.. 9 రోజుల కార్యక్రమం బుధవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జ్యోతినగర్‌లోని వారి ఇంటికి సంజయ్ వచ్చారన్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. లోపలికి వెళ్లి సంజయ్‌ను స్టేషన్‌కు రావాల్సిందిగా ఏసీపీ కోరారు.
ఎందుకు రావాలి..?
ఏ కేసులో తనను తీసుకెళ్తున్నారని సంజయ్ ప్రశ్నిస్తూ ఇంట్లో నుంచి కదలకుండా మొండికేశారు. తనను అరెస్ట్ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం అందించారా? అని ప్రశ్నించారు. పదో తరగతి పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తానన్న ఉద్దేశంతోనే అదుపులోకి తీసుకుంటున్నారా అని నిలదీశారు. తనను ముందస్తుగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సమాచారం తెలియజేయాలని కోరుతుండగానే పోలీసు స్టేషన్‌కు వెళ్లాక విషయం చెబుతామంటూ పోలీసులు బలవంతంగా సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
బలవంతంగా..
పోలీసులకు, సంజయ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆయన ప్రతిఘటిస్తున్నప్పటికీ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. పోలీసు వాహనంలో ఆయనను తరలించారు. ఈ క్రమంలో ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు వాహనం మొరాయించడంతో మరో వాహనంలోకి ఎక్కించారు. పోలీసులు బలవంతంగా బండి సంజయ్‌ను వ్యాన్‌లో ఎక్కించుకు వెళుతుండగా పోలీసులను అడ్డుకునేందుకు కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు.
Recent Comments