Saturday, September 21, 2024
Homeతెలంగాణవైఎస్ షర్మిల మళ్లీ అరెస్ట్

వైఎస్ షర్మిల మళ్లీ అరెస్ట్

టీఎస్ పీఎస్ ఎదుట బైఠాయింపు
అదుపులోకి తీసుకున్న పోలీసులు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి అరెస్ట్ అయ్యారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌ కేసును సీబీఐకు అప్పగిస్తూ.. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం టీఎస్ పీఎస్సీ ముట్టడికి వెళ్లిన షర్మిల పేపర్ లీకేజ్‌ను నిరసిస్తూ కార్యాలయ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని షర్మిలను అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను షర్మిల కోరారు. అయితే అందుకు పోలీసులు నిరాకరించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని, ఈ వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్ కేవలం ఇద్దరికి మాత్రమే ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 2017 నుంచి పేపర్ లీకేజ్ జరుగుతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు సేకరించడంలో విఫలమవుతోందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపైనా కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో అనేకమార్లు టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మాత్రం పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. షర్మిల ఆందోళనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments