సెల్, టీవీ రీచార్జి చేయించలేదని విద్యార్థి ఆత్మహత్య
స్పాట్ వాయిస్, కాటారం: సెల్ ఫోన్, టీవీ రీచార్జి చేయించలేదని ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన గోగు యశోద -అర్జయ్య దంపతులకు కూతురు శరణ్య, కొడుకు తరుణ్ (12) ఉన్నారు. తరుణ్ కొత్తపల్లి హైస్కూల్ లో 6వ తరగతి చదువుతున్నారు. అయితే యశోద భర్త అర్జయ్య మూడేళ్ల క్రితం చనిపోగా, అప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ వారిని పోషించుకుంటోంది. కాగా, యశోద ఇంట్లోని టీవీ బ్యాలెన్స్ రెండు రోజుల క్రితం అయిపోయింది. అయితే బుధవారం 12.30 గంటలకు స్కూల్ కి వెళ్లి వచ్చిన తరువాత తరుణ్ తల్లితో టీవీ, సెల్ రీచార్జి చేయించమని అడిగాడు. అయితే టీవీ వైర్లను ఎలుకలు కొరికి పాడు చేశాయని, వాటిని రిపేరు చేయించిన తరువాత టీవీ తోపాటు సెల్ రీచార్జి చేయిస్తానని తరుణ్ కు నచ్చ జెప్పిన యశోద పని నిమిత్తం ఎడ్ల దగ్గరికి పోయింది. మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో పొరుగున ఉన్న గొమాప బాలమ్మ యశోద దగ్గరకు వెళ్లి ‘మీ ఇంటికి ఎవరో ‘ బంధువులు వచ్చారు. తొందరగా ఇంటికి పో” అని చెప్పగా, వెంటనే ఆమె ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో తరుణ్ ఇంట్లోని ఇనుపపైపుకు చీరతో ఉరేసుకుని అపస్మారక స్థితిలో కనిపించాడు. పొరుగు వారి సహకారంతో తరుణ్ ను మహదేవపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కాగా, టీవీ, సెల్ రీచార్జి అడిగిన వెంటనే చేయించకపోవడంతో క్షణికావేశానికి గురైన తరుణ్ ఉరేసుకుని చనిపోయినట్లు తల్లి యశోద వాపోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments