ఆ తప్పు పోలీసులదే..!
పోస్టుమార్టం మాత్రమే డాక్టర్ డ్యూటీ
కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించే బాధ్యత పోలీసులదే.
స్పాట్ వాయిస్, వరంగల్ : ఎంజీఎం మార్చురీలో మృతదేహాలు మారిన ఘటన మృతుల కుటుంబాలను ఆందోళనకు గురిచేసింది. తమది కాని మృతదేహాన్ని తమకు అప్పగించడం ఏంటని బాధిత కుటుంబసభ్యులు ఎంజీఎం మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్ ఘణపూర్ మండలం తానేదార్పల్లి గ్రామానికి చెందిన రాగుల రమేష్ (38 ) కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన ఆశాడపు పరమేష్ (45) నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంతో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం ఉదయం పంచనామా అనంతరం రెండు మృతదేహాలకు ఎంజీఎం ఫోరెన్సిక్ సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను అప్పగించే సమయంలో గందరగోళం జరిగి మృతదేహాలు మారిపోయాయి. మృతుల కుటుంబసభ్యులు మృతదేహాలను తమ తమ స్వగ్రామాలకు తరలించి అనంతరం మృతదేహాలను పరిశీలించి మృతదేహాలు మారాయని గుర్తించారు. మృతదేహాలను వెంటతీసుకొని తిరిగి ఎంజీఎం మార్చురీకి తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. దాంతో రెండు మృతదేహాలను పరిశీలించి పోలీసుల సమక్షంలో వారి వారి కుటుంబసభ్యులకు తిరిగి అప్పగించడం జరిగింది. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ను వివరణ కోరగా శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. . ఏదిఏమైనప్పటికీ రెండు మృతదేహాలను అప్పగించిన సమయాల్లో పూర్తిగా పరిశీలించకుండానే మృతదేహాలను అప్పగించిన పోలీసుల తీరుపై మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recent Comments