అధికారికి ఇదేం బుద్ధి …!
వంట మనిషికి ఏఎస్ డబ్ల్యూ ఓ లైంగిక వేధింపులు
సీపీ రంగనాథ్ కు బాధితురాలి ఫిర్యాదు
స్పాట్ వాయిస్, కమలాపూర్ : ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరిస్తూ హాస్టల్ లో పనిచేస్తున్న వంట మనిషిని ఓ అధికారి లొంగదీసుకున్నాడు. అతడి టార్చర్ భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే పిల్లలు ఉన్నారని ఎలాగైనా బతకాలనుకున్న ఆ మహిళ చివరకు న్యాయం కోసం వరంగల్ సీపీ రంగనాథ్ ను ఆశ్రయించింది. కమలాపూర్ మండల కేంద్రం ఎస్సీ హాస్టల్లో వంట మనిషిగా పని చేసే మహిళపై ఏఎస్ డబ్ల్యూ వో లక్ష్మణ్ నాయక్ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా తనను ఉద్యోగం పెట్టించాడనే ఉద్దేశంతో ఏఎస్ డబ్ల్యూవో లక్ష్మణ్ నాయక్ పలుమార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని వాపోయింది. తన కోరిక తీర్చకపోతే ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరించేవాడని కన్నీటి పర్యంతమైంది. ఒకానొక సందర్భంలో ఆ అధికారి టార్చర్ భరించలేక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడినట్లు చెప్పింది. ఏం చేయాలో తోచక మానసిక వేదన అనుభవించానని వాపోయింది. ఎదిగిన కొడుకు ఎందుకు బాధపడుతున్నావమ్మా.. అన్నప్పుడు ఏం చెప్పాలో తెలియక, దుఃఖాన్ని ఆపుకోలేక నరకం అనుభవించానని వాపోయింది. ఇక ఏఎస్ డబ్ల్యూ వో లక్ష్మణ్ నాయక్ టార్చర్ భరించలేక వరంగల్ సీపీ రంగనాథ్ ను ఫిర్యాదు చేశానని తెలిపింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంది.
Recent Comments