సుమారు గంటపాటు చర్చలు..!
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ నుంచి బయటికి వచ్చిన ఖమ్మం నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీ వైపు వెళ్తారోననే ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఆయన మొదట బీజేపీకి వెళ్తారనే చర్చ వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్తారని, ఆయనకు ముందునుంచి ఆ పార్టీ పెద్ద నేతలు టచ్ లో ఉన్నారనే కథనాలు వచ్చాయి. దీంతో ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారోనని ఉత్కంఠ ఖమ్మం జిల్లాతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.
వైఎస్ షర్మిలతో భేటీ..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా వైఎస్ షర్మిలతో భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ లో ఒక రహస్య ప్రాంతంలో సుమారు గంట పాటు చర్చలు జరిపినట్లు తెలిసింది. పార్టీలో చేరాలని వైఎస్ షర్మిల ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఆయన నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో పొంగులేటి వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరేందుకు విముఖత చూపుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఖమ్మంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నేటికి అభిమానులు ఉండడం, పొంగులేటి సైతం వైఎస్సార్ అభిమాని. ఈ క్రమంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.
Recent Comments