Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుఅనాడు తెలంగాణ కోసం .. ఈనాడు దేశం కోసం..

అనాడు తెలంగాణ కోసం .. ఈనాడు దేశం కోసం..

దేశ హితం కోసమే బీఆర్ ఎస్
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే సీఎం ధ్యేయం ..
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
కొప్పుల ముదిరాజ్ లకు అండగా ఉంటానని హామీ
జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన
స్పాట్ వాయిస్, శాయంపేట : తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఏవిధంగా నెరవేర్చారో ప్రస్తుతం దేశ హితం కోసం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీకి శ్రీకారం చుట్టారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమ పంథాను ఎంచుకున్నారని, ఈ రోజు దేశంలో నూతన రాజకీయ ఒరవడిని సృష్టించేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం భూపాలపల్లి నియోజకవర్గ పరిధి శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ కొప్పులలో ముదిరాజ్ సోదరులు నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 10 లక్షల నిధులు అందిస్తుందని, తమ వంతుగా పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని విరాళంగా అందిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ ల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. చేప పిల్లల పంపిణీ కోసం శాయంపేట మండలానికి అదనంగా రూ. 2.20కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. కొప్పుల గ్రామ ముదిరాజ్ సోదరులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, గ్రామస్తులు ఏం అవసరం వచ్చినా తనను సంప్రదిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బీఆర్ ఎస్ ను స్వాగతిస్తు్న్న అనేక రాష్ట్రాలు
బీఆర్ ఎస్ పార్టీ అరంగేట్రంపై దేశంలోని అన్ని రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయని గండ్ర స్పష్టం చేశారు. వందల ఏళ్లు దేశంలో కీలక భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీన పడుతూ బీజేపీ పార్టీని ఎదుర్కోలేని స్థాయికి చేరిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఎం కేసీఆర్ దేశంలోని రాజకీయ శక్తులను పునరేకీకరించేందుకు అనేక పార్టీల నాయకులను, ప్రజాస్వామ్య వాదులను, మేధావులను, రైతులను ఒక్కటి చేసి జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టారన్నారు. తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ ఎస్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిందని, అదే విధంగా దేశంలో మార్పు తీసుకువచ్చేందుకు, ప్రజల జీవన ప్రమాణాలు మార్చేందుకు బీఆర్ ఎస్ పార్టీకి శ్రీకారం చుట్టారన్నారు. పార్టీ ద్వారా తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా అమలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దళిత బంధు పంపిణీ విషయంలో బీజేపీ అడ్డు పడుతోందని, ఆయా వర్గాల ఆర్థికాభివృద్ధికి బీఆర్ ఎస్ అహర్నిషలూ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments