మళ్లీ వాళ్లకే సీట్లా..
మాకొద్దా పదవులు
సిట్టింగ్‌కే టికెట్‌తో తంటా..
కారులో ఎగిసిపడుతున్న అసంతృప్తి సెగలు
సార్ గేమ్ ప్లాన్ అంటున్న విశ్లేషకులు
ఇలాగే ఎన్నాళ్లంటూ అనుయాయులతో చర్చలు
భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు
క్యాష్ చేసుకోనున్న బీజేపీ..
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు.. ఉద్యమంలో కొట్లాడాం.. సముచిత స్థానం అంటే పార్టీ మారాం. రెండు దఫాలు పాలన ముగిసిపోతోంది. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. మూడోసారి వాళ్లకే సీట్లు కేటాయిస్తే ఎట్లా..? మాకొద్దా పదవులు.. ఎన్నాళ్లు ఈ సెకెండ్ కేటగిరీ బతుకులంటూ కారులో నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ మంగళవారం నిర్వహించిన సమావేశంలో మళ్లీ సిట్టింగ్‌లకే సీట్లు కేటాయిస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే టికెట్‌పై ఆశపెట్టుకున్న ఆయా నియోజకవర్గ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ అనుయాయులతో సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నాళ్లు ఇలానే ఉంటాం.. పార్టీ మారితే ఎలా ఉంటుందనే చర్చ తెస్తున్నట్లు సమాచారం. ఇక బీజేపీ సైతం ఆయా నియోజకవర్గంలో టికెట్ ఆశించే వారిని పార్టీలోకి చేర్చుకోవాలనే ఆలోచనలు చేస్తోంది. ఇదిలా ఉంటే గులాబీ బాస్ గేమ్ ప్లాన్ లో భాగంగానే సిట్టింగ్ లకే సీట్లు అన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా సిట్టింగ్ లకే సీటు మాట మాత్రం కారును కుదుపునకు గురి చేసే అవకాశం లేకపోలేదు.
స్పాట్ వాయిస్, ఓరుగల్లు
========
‘సిట్టింగ్ లకే మళ్లీ టికెట్లు ఇస్తాం.. జనాల్లోనే ఉండండి.. గెలుపునకు బాటలు వేసుకోండంటూ’ సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ హితబోధ చేశారు. ఈ వ్యాఖ్యలు బాగానే ఉన్నా.. కారులో అసంతృప్తి సెగలు రగిలేలా చేసింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారే.. రెండోసారి జరిగిన ఎన్నికల్లోనూ బరిలో నిలిచారు. ఉద్యమం నుంచి కేసీఆర్ వెంట ఉన్నవారు.., తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి కొంతమంది, పార్టీ అవసరాలను బట్టి ఆహ్వానించిన వారితో ప్రస్తుతం కారు ఓవర్ లోడ్ తో ఉంది. అయితే ఎప్పటికైనా సార్ కరుణిస్తారు.. టికెట్ వరిస్తుందని ఆశిస్తున్న వారి ఆశలు గల్లంతు చేస్తూ మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో సీఎం సిట్టింగ్ లకే సీట్లు ఇస్తామంటూ చెప్పారు. దీంతో ఇన్నాళ్లు తమకు టికెట్ వస్తుందని ఆశపెట్టకున్న వారంతా.. నిశ్చేష్టులయ్యారు. వారి భవితవ్యం మళ్లీ అంధకారంలో పడిపోయింది.
మేం ఇంతేనా..?
ఉద్యమ వేడి, ప్రత్యేక పోరు తగ్గకపోవడం, టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనే నినాదం బలంగా ఉండడంతో రెండు పర్యాయాలు టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ గాలి వీస్తుండడంతో తమకు టికెట్ కేటాయిస్తే.. ‘అసెంబ్లీలో అధ్యక్షా’.. అంటామనే ఆశల్లో టికెట్ ఆశిస్తున్న వారు ఉన్నారు. ఇన్నాళ్లు పని తీరు.. గెలుపు గుర్రానికే టికెట్ అన్న పెద్దసార్ ఒక్కసారిగా సిట్టింగ్ లకే టికెట్ అనడంతో రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని ప్రధాన నాయకులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ భవితవ్యం ఏంటనే ఆలోచనలో పడ్డారు. ఇక తాము నియోజకవర్గ నాయకులుగానే మిగిలిపోవాలా అనే ఆత్మన్యూనతా భావంలో పడిపోయారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నామని తమను అధినాయకత్వం గుర్తించకపోవడం దారుణమంటూ బహిరంగగానే నిరసన వెల్లగక్కుతున్నారు.
ఇద్దరికిపైగా ఆశావహులు..
తెలంగాణ ఏర్పడిన అనంతరం టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ లో భారీగా చేరారు. అప్పటికే ఉద్యమంలో కొట్లాడిన నేతలు ఉన్నారు. రెండుసార్లు అధికారంలోకి రావడం.. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ప్రతిపక్షం లేకుండా చేసే పనిలో చాలా మంది ప్రధాన నాయకులు కారెక్కి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురికిపైగానే ఆశావహులు ఉన్నారు. ఇక కేసీఆర్ బలంతో ఈజీగా గెలువచ్చనే భావన సైతం వీరిలో ఉంది. దీంతో ఏళ్లుగా టికెట్ కోసం నాయకులు పరితపిస్తూనే ఉన్నారు. ఇంకోసారి, ఇంకోసారి అంటూ 8ఏళ్లుగా వేచి చూస్తూనే ఉన్నారు. ఈక్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమను కేసీఆర్ గుర్తిస్తారనే ఆశలో ఉన్నారు. అయితే మంగళవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వీరలో నిరాశను నింపాయి. అంతేస్థాయిలో అసంతృప్తిని రగిలించాయి.
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..
ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మంది రెండు పర్యాయాలుగా కొనసాగుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం మందిపై జనాల్లో అసంతృప్తి, వ్యతిరేకత నెలకొంది. చాలా మంది ఎమ్మెల్యేలు రెండుసార్లు గెలిచామనే అహంకారం, తమకు అడ్డులేదనే ధైర్యంతో ఒంటెత్తు పోకడలు పోయారు. దీంతోపాటు గ్రామాల్లో తమ అనుయాయులకు తప్పా.. సామాన్య ప్రజలకు వీళ్ల నుంచి ఒరిగింది పెద్దగా ఏమీ లేదు. ఈక్రమంలో మరోసారి వీరి గెలుపు కష్టంగానే ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించే పెద్ద తలలు ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ అధినాయకుడికి అందిస్తూనే ఉన్నారు. తమకు టికెట్ వచ్చేలా పావులు కదుపుతూ.. గ్రామాల్లోనూ ఆయా ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా పర్యటనలు, పరామర్శలు, దావత్ లు చేస్తూ.. నేనున్నాననే ధైర్యాన్ని కల్పిస్తూ వస్తున్నారు. ఎలాగూ గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తే తాముంటామని ఆశించిన వారికి కేసీఆర్ వ్యాఖ్యలు మింగుడుపడడం లేదు.
కేసీఆర్ గేమ్ ప్లాన్..!
సిట్టింగ్ లకే టికెట్ అనడం సీఎం కేసీఆర్ రాజకీయంలో ఒక ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీ ఫాంలో ఉండడం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు దిగుతుండడంతో వాటిని నిరోధించడానికి ఆయన వేసిన రాజకీయ అడుగుగా చెబుతున్నారు. సిట్టింగ్ లకే సీటు అంటే.. టికెట్ ఆశించే వారిలో నిజమైన వారెవ్వరూ.. పార్టీ మారెవారెవ్వరూ..అనేది తేలిపోతుందని, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు చేజారిపోకుండా కాపాడుకుంటే ఎన్నికల వరకు పార్టీ బలంగా ఉంటుందనే ఆలోచనలో భాగంగానే ఆ మాటలు చెప్పారని చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల ముందు పార్టీలు మారడం సహజం కావడంతో తమ వారు గోడలు దునకకుండా ఉండేందుకు ఇలాంటి ఎత్తుగడ వేశారని అంటున్నారు.
సగం మందికి పైగా ఔట్..
తెలంగాణలో మూడోసారి జరిగే ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ల్లో సగానికిపైగా టికెట్లు కోత పెడుతారని ప్రతిపక్షాలతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. ఈసారి బీజేపీ బలంగా ఉండడం, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం, కేటీఆర్ సీఎం కావాల్సిన ఆవశ్యకత ఉండడంతో కేవలం గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించి అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు యువనాయకుడు కేటీఆర్ సైతం తనకంటూ కొన్ని నియోజకవర్గాల్లో యూత్ నేతలను ఇప్పటికే రంగంలోకి దింపినట్లు చర్చలు సాగుతున్నాయి. సీఎం అయితే తన వారంటూ ప్రత్యేకంగా ఉండాలనే భావనతో ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో చాలా మంది నేతలను ప్రోత్సహిస్తు్న్నట్లు టీఆర్ఎస్ నాయకులే చెప్పుకుంటున్నారు. సదురు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు వారు కొరకరాని కొయ్యగా మారిపోయారు. ఇదిలా ఉంటే కేసీఆర్ వద్ద ఎమ్మెల్యేల చిట్టా అంతా ఉందని, ఎవరు ఏం చేస్తున్నారు.. గెలిచేది ఎవరూ.. ఓడేదెవ్వరూ.. టికెట్ ఎవరికి ఇవ్వాలనే పూర్తి జాబితా సిద్ధమైందని చెబుతున్నారు.
క్యాష్ చేసుకోనున్న బీజేపీ
తెలంగాణలో ఈసారి అధికారం దక్కించుకోవడానికి బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈక్రమంలో టీఆర్ఎస్ లోని ప్రధాన నాయకులు, అసంతృప్తి నాయకులపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ హామీ ఇచ్చి వారిని తమ వైపు తిప్పుకునే పనిలో ఉంది. అయితే తాజాగా చేసిన కేసీఆర్ వ్యాఖ్యలు కమలానికి మరింతగా కలిసివచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ క ప్రత్యామ్నాయం బీజేపీ అనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఉప ఎన్నికల్లోనూ ఇది రుజువైంది. ఈనేపథ్యంలో అధికార పార్టీలోని చాలా మంది చూపు కమలంపై పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు చేరికలపై మరింత దృష్టిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Recent Comments