Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్ముక్క, సుక్క ఇట్లిరికిచ్చే..

ముక్క, సుక్క ఇట్లిరికిచ్చే..

హరిహరా.. ఏందిది..?
ఏదో చేయబోతే.. మరేదో అయ్యే…
ముక్క, సుక్క ఇట్లిరికిచ్చే..
అడుసు తొక్కనేలా..? కాలు కడుగనేలా..?

స్పాట్ వాయిస్, వరంగల్: ఏమిటి రాజనా(లా)యనా ఇదీ..! అడ్డూ అదుపు లేదా..? .., ఏదొచ్చినా ఆపుకోవా.., గుర్తిస్తారు సార్.. తప్పకుండా గుర్తిస్తారుతీయ్. అంత ఆత్రుత ఎందుకయ్యా..? దేనికైనా టైం రావాలే కదా. అసలే మనం జంపింగ్ జపాంగ్లమాయే. ఏదో సందర్భం వచ్చినప్పుడు లటక్కున వచ్చి గూట్లో దూరినోళ్లమైతిమి. వచ్చీ రాంగానే కూర్చీలో కూర్చోబెడతారునుకుంటే డామిట్ కథ అడ్డం తిరిగే. పోనీ గతంలో మనకు మాదిరిగానే చేరిన వాళ్లంతా ఇలాగే వెయిట్ చేశారా.. అంటే లేదే.. మరి వాళ్లకెందుకు తొందరగా వరించింది అనే బాధ మీకుండొచ్చు. అరె.. ఎవరి అదృష్టం వారిది. వాళ్లకు గీత సక్కగున్నది.., మనకేమో వంకర తింకరగా కాలవడ్డది. ఏం చేస్తాం చెప్పు. ఘడియ అసొంటిది. కాస్త నెమ్మదించు.. మీ వంతు వచ్చే వరకు నిదానించు….

నువ్వేమో ఏం చేసైనా పెద్దాయన దృష్టిల పడాలే.. పోస్టు కొట్టేయాలే అని చూస్తుండవడితివి. వానల్లో గొడుగులు పంచితివి.., ఎండల్లో నీళ్లు పోస్తివి.., చలిలో రగ్గులు అందజేస్తివి. కానీ ఎన్ని చేసినా కాలం కలిసి రాకపోతుండే. నడిచొచ్చే కొడుకేమోగానీ, కాళ్లల్లో కట్టె పెట్టే వారే ఎక్కువవుతున్నట్టుంది. అన్నీ అనుకూలంగానే ఉంటాయనుకోవద్దు నాయనా.. కొన్ని విషయాల్లో మంచిచేయబోతే.. చెడే ఎదురైనట్టు, అతి చేస్తే మొదటికే మోసం వస్తది. అయినా ఇసొంటి ముచ్చట్లు జనాలకంటే మీకే బాగా తెల్సు. గట్ల గాచారం కలిసిరాని టైంలా పెద్దాయన కాదు కదా.., ఆయన పక్కనున్న ‘చిన్నోళ్లు’ కూడా కాపాడరు.. కనీసంగా దగ్గరికి కూడా రానివ్వరు. చేసేకాడికి చేస్తేనే అందం.., శృతి మించితే అందవిహీనమే. ఇప్పుడు చూడు మెప్పు కోసం ముక్క, సుక్క పంచితే తుప్పు వదిలవట్టే. విషయం పెద్దదాయె.. విచారణ వరకు పోయి సంజాయిషీ ఇచ్చుకునే దాక పోయే. ఫాఫం.. ఎవ్వలో గిట్టనోల్లో, పక్కనే ఉండి గుచ్చాలని చూసేటోళ్లు పెట్టేకాడ పెట్టి ఇరికించే. హరి.. హరా.. ఏందిది..?

రాజనాల శ్రీహరికి నోటీసులు
టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి కి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. దసరాకు ముందు రోజు స్థానిక హమాలీలకు సుమారు 200 మందికి రాజనాల శ్రీహరి మద్యం, కోళ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ కొత్తపార్టీ పెట్టబోతున్న సందర్భంగా మద్యం పంపిణీ చేసినట్టు వెల్లడించారు. కేసీఆర్ , కేటీఆర్ భారీ కటౌట్ల ముందే శ్రీహరి మద్యం పంపిణీ చేశారు. ఆయన పని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం తలెత్తింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మద్యం పంపిణీ చేస్తున్నారంటూ ఈసీకి స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుపై స్పందించి ఈసీ.. శ్రీహరి మందు పంపిణీకి సంబంధించి వివరణ ఇవ్వాలని వరంగల్ కలెక్టర్‌ను కోరింది. అలాగే రాజనాల శ్రీహరికి నోటీసులు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments