తెలంగాణపై కమలం చూపు..
ఢిల్లీపై గులాబీ గురి..
పువ్వుల మధ్య టఫ్ ఫైట్..
రెంటికీ ఊరిస్తున్న భవితవ్యం..
మునుగోడుతో ముదిరిన పానకం..
…………………………………..
పసందైన మన్ కీ బాత్.., విన సొంపైన దేశ్ కీ నేత. ఏమీ విచిత్రం. రాష్ట్రంలో పాగాకు కేంద్రం.., కేంద్రంలో పాగాకు రాష్ట్రం ఉవ్విళ్లూరుతున్న విచిత్రం. గురిచూసి గిరటేస్తూ గులాబీ ముళ్లును విరిచి, సింహాసన సిగలో కమలం తురమాలని వారి పన్నాగం.., అడుగునున్న కాడను లాగేందుకు బలాన్ని పోగేస్తూ రెక్కలు తుంచాలని గులాబీ వ్యూహం. అటు వాళ్లిటూ.., ఇటు వాళ్లటూ. ఎవరి ఆరాటాలు వాళ్లవి.., ఎవరి పోరాటం వారిది. కుడి ఎడమైతే పొరపాటు లేదంటే ఎలా.., కుడి ఎడమైతే ఎడం పెరిగినట్టేగా.., ఎడమ కుడిదైతే ఇద్దరికీ కుదరలేదన్నట్టే. కుడి వర్సెస్ ఎడమ.., కమలం వర్సెస్ గులాబీ.
వణికించిన మహమ్మారి వరకు ఒక లెక్క.., కోలుకుంటున్న వేళ నడుస్తున్నది మరో లెక్క. ఈ తేడాలు అప్పటికప్పుడు వచ్చినవేమీ కావు.., కానీ, ఇప్పుటికిప్పుడే బయటపడుతున్న తీరే కాస్త కొత్త. అసలే రాజకీయం, అందునా తలపండిన నేతల మధ్య సాగుతున్న తలపడే క్షేత్ర పర్వం. ఆరితేరిన ఉద్ధండులు., ఒక్కసారిగా బయటపడని నైజం గల ద్రష్టలు. ద్వేషాన్ని ప్రేమించడం, ప్రేమను కప్పుకుని తిరగడం దినచర్యలో భాగంగా అన్నట్టు అలవాటు చేసుకున్న డైనమిక్ లు.
90వ దశకం నుంచి మూడు కూటముల మూలపుటమ్మల ఏలికలో పయణం సాగిస్తున్న భారతావనికి ఇప్పుడు కొత్త అనుభవం. రెండు పర్యాయాలు యూపీఏ, రెండు పర్యాయాలు ఎన్డీఏ అనుభవాలు పూర్తికాబోతున్నాయి. 2023 తర్వాత ఏంటి..? అనేదే చర్చ. ఒక్కటిగా ఉండలేరు.., ఒక్కడికి అప్పగిస్తే కలిసిపోరు., ఒక్కటైతే అంతకన్న పెద్ద శక్తిలేమీ ఉండవని తెలిసినా ఒక్కొక్కరు ఒక్కరిగానే నడుచుకునే తత్వమున్న కాంగ్రెస్ కుంటుతూనే సాగుతోంది. పరుగులు తీయాల్సిన సమయంలో కూడా నడకలు నేర్చినట్టుగా కదలుతానంటే పోటీలో నిలిచేదెప్పుడూ.., నిలిచి గెలిచేదెన్నడూ..? ఏదైతే అదైంది తాబేలు గెలిచే రోజులొస్తాయిలే అనేకుంటే అదిప్పుడు సాధ్యమయ్యే అవకాశాలు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు.
బలాబలాలు ఎలా ఉన్నా, భవిష్యత్ మాత్రం ఊరిస్తోంది. ఒక ప్రాంతాన్ని దాటిన పార్టీ రాష్ట్రాన్ని లీడ్ చేసింది.., అదే పార్టీ ఇప్పుడు రాష్ట్రాలన్నీ దాటుకుంటూ వెళ్లి దేశవ్యాప్తంగా ఎలా మారబోతోందో చూడాలనే ఆత్రుత అందరికీ కలగడం సహజమే. ఇక్కడి ఒక్కడు 29 రాష్ట్రాలని మెప్పించగలడా..?, అక్కడి ఇద్దరు ఒక్కొక్కటిగా పర్చుకుంటూ 29 రాష్ట్రాల్లో కుర్చీ వేసుకుని కునుకు తీయగలరా..? తేలాలంటే మరింత కాలం ఆగాల్సిందే. సమయం ఉన్న విషయాన్ని సాధారణంగా తీసుకుందాంలే అని తేలికవ్వడానికి అంగీకరించని తరుణం.
అటువాళ్లిటు.. ఇటు వాళ్లటు. వ్యక్తుల మధ్య ఆధిపత్యం ఇంత దూరం తెచ్చిందా..? రెండు పార్టీల మధ్య అంతర్గత పోరు తీసుకొచ్చిందా..? భిన్న మనస్సులు వికలమై అగాధానికి ఊపిరి పోసిందా..? కారణమేదైనా కార్చిచ్చు రగులుకుంది. హైదరాబాద్ నుంచి హస్తినాకే పాకిందో.., అట్నుంచే ఇటు వీచే గాలికే వ్యాపించిందో గానీ కొద్దికొద్దిగా పెరుగుతూనే ఉంది. దుమ్ము రేగి కుమ్మేసుకోవడం దుబ్బాక నుంచే మొదలైందో.., భిన్న సంస్కృతుల ఆలవాలమై ఆయువు పట్టు వంటి గ్రేటర్ హైదరాబాద్ నుంచో కాస్త పెరిగిందో.., అదీ కాదంటే అంతా చిన్నదే కాదా అనుకున్నది చింపి చాటంత అయిన హుజూరాబాద్ లోనే చెలరేగిందో గానీ పుట్టిన ముసలం ముదురుతూనే ఉంది. ఇప్పుడు మునుగోడుతో క్లైమాక్స్ కు చేరింది.
పాలు నీళ్ల మాదిరిగా కలిసిన రోజులు గతం.., ఉప్పునిప్పుగా మార్పు వర్తమానం. భవిష్యత్ ఏమిటో ఇప్పుడప్పుడే తేలడం అసాధ్యం. ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ ఢిల్లీ కిందకు దిగుతోంది.., ఒక్కోటే ఎక్కుతూ ఢిల్లీకి చేరాలని ప్రయత్నం ఇక్కడ మొదలైంది. ఈ క్రమంలోనే వీళ్లపై వాళ్లు.., వాళ్లపై వీళ్లు.. ఒకళ్లపై ఒక్కరు. సవాళ్లు.., ప్రతిసవాళ్లు. సభలు, సమావేశాలు. నువ్వు ఎడ్డెం అంటే నేను తెడ్డం అంటా.. నువ్వు తెడ్డెం అంటే నేను ఎడ్డెం అంటా.. అనే ధోరణి రెండు పార్టీల మధ్య పెరిగిపోయింది. ఒక్కరి పథకాలపై ఇంకొకరు దుమ్మెత్తిపోసుకోవడం.., పనితీరును పతాక స్థాయిలో ఎత్తి చూపుకోవడం., సంబంధాలను ఛీదరించుకోవడం.., ప్రతీ కార్యానికి రాజకీయ రంగు పులమడం ఇప్పుడు ఇంటా బయట పరిపాటిగా మారింది. మెచ్చుకున్నా కూడా మతలబు ఏమై ఉంటుందో అనే స్థాయిలో అనుమానపు బీజాలు రేగే స్థాయికి కమలం గులాబీ రాజకీయం మారింది.
నేతలు నెరుపుతున్న యుద్ధ తంత్రాలు., పార్టీల నడుమ సాగుతున్న కదన వ్యూహాలు.., కూటములు తలాభారంగా భావించే జయాపజయాలు.., బలా బలాలను బేరీజు వేసుకునే కేడర్లు.., ఇవన్నీ ఒకెత్తు అయితే.., భవిష్యత్ ను బంగారమల్లే నిక్షిప్తం చేసుకుని అవసరం ఉన్నప్పుడు బహిర్గత పరిచే చాతుర్యం కలిగి ఉన్నది ఓర్పరి తనాన్ని ప్రదర్శించాల్సిన ఓటరు తీరు మరో ఎత్తు. వేటగాళ్ల కుయుక్తులకు చిక్కి విలవిలలాడుతాడో.., సాధ్యాసాధ్యాల సామర్థ్యాలను ఓపికగా గమనించి సరైన తీరుగా సెలవిస్తారో తేల్చాల్సింది అతగాడే. కాలమెప్పుడు ఒకేలా ఉండకపోవచ్చు.., గత పాఠాలెప్పుడు గుచ్చుతూ మేల్కొలుపుతూనే ఉంటాయనే విషయాలను అంత తేలిగ్గా విడిచే అవకాశాలు ఉండకపోవచ్చు.. కానీ, సన్నగిల్లుతున్న ఆశలకు ఎరువు వేసి బతికించుకోవాల్సిన అవకాశాన్ని కోల్పోతే మాత్రం ఇక అంతే సంగతులు. ఫైనల్ ముందు సెమీస్ మాదిరిగా జరుగుతున్న మునుగోడులో విజయం ఏ పార్టీకి దక్కిన అది ప్రజల ఖాతాలోనే జమచేయాల్సిందిగా భావించాల్సి ఉంటుంది.
ఏదేమైనా కుమ్ములాటల కాంగ్రెస్ ను ఢీకొనడం పెద్ద సమస్యే కాదని భావిస్తున్న కమలానికి ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ రూపంలో కొత్త సవాల్. ఎక్కడెవరు లేకుంటే వచ్చినోరే దిక్కు అన్నట్టుగా రెండు ప్రధాన పక్షాల మధ్య మూడో ప్రత్యామ్నాయం ప్రజలకు ముమ్మాటికి ప్రత్యేకంగానే ఉంటుంది. అయినా కొత్తొక వింత, పాతొక రోత మాదిరిగా పాతవాళ్లు పలుచనోల్లే.., కొత్త వాళ్లు బలిచినోళ్లే కాదా. టీఆర్ఎస్ , బీఆర్ఎస్ అయిన తర్వాత పరిణామాలపై యావత్ దేశమేమోగానీ తెలంగాణ ప్రజానీకం మాత్రం ఉత్సుకతతో ఉన్నారు.
‘బంధు’లన్నీ నిలబెడతాయా..?
బంధులో నిలువరిస్తాయా..?
ఈ బంధులే దేశంలో బంధుగణాన్ని తెచ్చేనా..?
బంధాలు తెంచే ‘బంధు’లుగా మారుతాయా..?
బీఆర్ఎస్.. భారత్ (బంధు) రాష్ట్ర సమితి అవుతుందా..?
మన్ కీ బాత్ ను.., దేశ్ కీ నేత నిలువరించేనా..?
సమయం తేల్చాల్సిన సమస్యలపై ఓ లుక్కేసి సావధానంగా గమనిస్తూ చూడడమే..
-రాజేంద్ర ప్రసాద్ చేలిక
స్పాట్ వాయిస్ ఎడిటర్
Recent Comments