Monday, November 11, 2024
Homeజనరల్ న్యూస్ఉద్యమకారుల ఊతం -విముక్తి గీతం

ఉద్యమకారుల ఊతం -విముక్తి గీతం

ఉద్యమకారుల ఊతం -విముక్తి గీతం

(ఐలమ్మ జయంతి ప్రత్యేక వ్యాసం )
మానవాళి అస్తిత్వానికి ఆరంభవాచకం అమ్మ ,అన్ని బాధలకి ,గాధలకు ప్రత్యక్షసాక్షి అమ్మ ,క్రమానుగత చైతన్యగీతిక అమ్మ.
మానవ పరిణామక్రమంలో అమ్మ నిర్వర్తిస్తూ వస్తున్న పాత్రను మహాన్నంతంగా నిర్వహించిన వారే మన తెలంగాణ చిట్యాల ఐలమ్మ .
ఐలమ్మ ఈ పేరు వింటే ఒక పారవశ్యం ఆశ్చర్యం ఉత్తేజం
అక్షర జ్ఞానం లేని ఒక మట్టి మనిషి ఒక మహత్తర విప్లవానికి చోదక శక్తిగా నిలిచారు.బతుకు విలువని స్వేచ్ఛ విలువని మనకు చాటారు.
రాచరికం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం జరిగిన పోరులో కమ్యూనిస్ట్ ల నేతృత్వంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అంకురార్పణ జరిపి అగ్నిశిఖగా కడవెండి గ్రామం నిలిచింది.ఈ నిప్పురవ్వలు కడవెండి కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకుర్తి గ్రామంలో వ్యాపించాయి.ఆ నిప్పురవ్వల కాగడాను అందుకున్న శ్రామికవర్గ ధీర చాకలి ఐలమ్మ.జీడీ సోమనర్సయ్య బ్రహ్మయ్య ల నాయకత్వంలో ఏర్పాటైన పాలకుర్తి గ్రామ ఆంధ్ర మహాసభలో సభ్యురాలిగా చేరి కమ్యూనిస్ట్ ల పోరాటాలకు సంఘీభావంగా ఉండేది.

యుద్ధం ఆహార సంక్షోభాన్ని సృష్టిస్తుంది.రెండవ ప్రపంచ యుద్ధకాలంఅది.ప్రపంచ మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారిన హిట్లర్ జర్మనీ ని ఓడించడానికి సోషలిస్టు రష్యా ,సామ్రాజ్యవాద బ్రిటన్ ,అమెరికా లు కలిసిపోరాడుతున్నారు.బ్రిటన్ తరపున పోరాడుతున్న సైనికులకు ఆహార ధాన్యాల సేకరణ భాద్యతను నిజాం రాజుకి ఇచ్చారు.నిజాం రాజ్యం లో 90%భూములు భూస్వాములు జాగీర్ధార్ ల అధీనంలో ఉన్నాయి.లెవీ ధాన్యం సేకరణలో వీరెవరూ సహకరించలేదు.నిజాం అధికారులు చిన్న సన్నకారు రైతుల నుండి బలవంతపు ధాన్యం సేకరణ చేస్తున్నారు.నిజాం రాజు డిప్యూటీ సేనాని ,పాలక మండలి లో కీలక సభ్యుడు ,రాజుకు కుడి భుజంగా ఉన్న విస్నూర్ దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి అధీనంలో కడవెండి పాలకుర్తి ప్రాంతాలు ఉండేవి.విస్నూర్ లో పెద్ద గడీ ,దానికి రక్షణగా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

దేశ్ ముఖ్ తల్లి జానమ్మ దొరసాని ఆధ్వర్యంలో కడవెండి గ్రామంలో లెవీ ధాన్యం సేకరణను గ్రామ ఆంధ్ర మహాసభ ,గుత్పల సంఘం అడ్డుకుంది.ఇది పరిసర గ్రామాలల్లో చైతన్యాన్ని తీసుకవచ్చింది.ప్రజలు దొరల నిజాం అధికారుల దోపిడీని ప్రతిఘటించడం ప్రారంభించారు.

చాకలి ఐలమ్మ 26 సెప్టెంబర్ 1895 రోజున గ్రామం కిష్టాపురం మండలం రాయపర్తి జిల్లా వరంగల్ లో ఓరుగంటి మల్లమ్మ సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించారు.తన పదవ ఏట పాలకుర్తి గ్రామానికి చెందిన చిట్యాల నరసయ్యతో వివాహం జరిగింది.అప్పటినుంచి ఓరుగంటి ఐలమ్మ పేరు చిట్యాల ఐలమ్మగా మారింది. ఈ దంపతులకు ఐదుగురు కొడుకులు, ఒక కుమార్తె .వీరి వృత్తి చాకలి వృత్తి దీనితో వచ్చే ఆదాయం సరిపోక పిల్లల పోషణకు ఇబ్బందిగా ఐలమ్మకు నరసయ్యకు మారింది. ఈ క్రమంలో పాలకుర్తి గ్రామానికి పక్కన ఉన్న మల్లంపల్లి గ్రామంలో ఉన్నటువంటి కొండలరావు దగ్గర 40 ఎకరాల భూమిని చాకలి ఐలమ్మ కౌలుకు తీసుకున్నది. దీనిలో నాలుగు ఎకరాలలో వరి పొలం సాగు చేశారు.శ్రమించే తత్త్వం,ఆత్మ గౌరవం ,ధిక్కార స్వభావం ఉన్న ఐలమ్మ తీరు పాలకుర్తి గ్రామ పట్వారి శేషగిరిరావు కు నచ్చలేదు. దీనితో చాకలి ఐలమ్మను లొంగదీసుకుని వెట్టి బానిసగా మార్చడానికి శేషగిరి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.దీనితో శేషగిరిరావు ఐలమ్మ కౌలు వ్యవసాయాన్ని.కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలిగా దేశముఖ్ ను కూలదోయడానికి పని చేస్తున్నదని రామచంద్రారెడ్డి కి చెప్పాడు.దీనితో దేశముఖ్ ఐలమ్మ కుటుంబము పై తప్పుడు కేసులు పెట్టి వేధించాడు.
చేసేవాడు. అప్పటికే రాపాక రామచంద్రారెడ్డి ఆగడాలను కమ్యూనిస్టులు అడ్డుకుంటూ అనేక విజయాలను పొందుతున్నారు .ఉద్యమానికి వెట్టి కులాల మద్దతు పై ఆగ్రహంగా రామచంద్రారెడ్డి ఐలమ్మ భర్త పై కొడుకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించి జనగామ ,చంచల్ గూడ ,ఖమ్మం,నల్గొండ జైళ్లలో పెట్టించాడు.కాలి నడకన తన భర్త కొడుకులు ఏ జైలులో ఉంటె ఆ జైలు ఉన్న ప్రాంతానికి తిరిగి కలిసివచ్చేవారు.చివరగా న్యాయస్థానంలో రామచంద్రారెడ్డి దొర పెట్టిన కేసులు వీగిపోయాయి.
బెదిరింపులకు లొంగని ఐలమ్మ న్యాయపోరాటం చేసి రామచంద్రారెడ్డి పై గెలిచినారు.

గతంలో తనపై భూసంబంధ హక్కులపై కోర్ట్ లో గెల్చిన బందగీ అనే ముస్లిం యువకుడిని రామాచంద్రారెడ్డి చంపించాడు.ఐలమ్మ అంశంలో అదే ధోరణి ప్రదర్శించి ఒక కొడుకును చంపించాడు.కౌలు కు చేస్తున్న భూమిలో పంటను తన గుండాలతో కోసుకునే ప్రయత్నం చేసాడు.
పాలకుర్తి పరిణామాలను గమనిస్తున్న దేవులపల్లి వెంకటేశ్వర్ రావు ,భీం రెడ్డి ,లక్ష్మి నరిసింహారెడ్డి పెద్ద ఎత్తున కేడర్ ను పాలకుర్తి కి తరలించారు.కడవెండి నల్లా నర్సింహా దళం ఇందులో కీలక పాత్ర వహించింది.పంటను కోస్తున్న దొర గుండాలని కమ్యూనిస్ట్ దళాలు తరిమి కొట్టి పంటను ఇంటికి చేర్చాయి.ఐలమ్మ ఇంటికి కాపలాగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉండడం ప్రారంభించారు.ఐలమ్మ ఇల్లు కేంద్రంగా ఉద్యమాలు మరింతగా విస్తరించాయి.
నాలుగు నెలలు తనకు అండగా ఉన్న వందల మంది సంఘ సభ్యులని ఎలా సాదుకుందో తన మాటల్లో “ఇంట్ల ఉన్న వడ్లు పట్టించి పెట్టిన ,ఊర్లో అడుక్కొచ్చి పెట్టిన ,సల్ల గట్క పెట్టిన ..భీంరెడ్డి కమలమ్మ చకిలం యాదగిరి రావు లాంటి పెద్ద నాయకులు నేను ఏది పెట్టిన తిన్నారు.కడవెండి ,దేవరుప్పులవాళ్ళు ఎక్కువగా నాకు రక్షణ గా ఉన్నారు.
సంగపోల్లు ఉద్యమ పని మీద వెళ్ళగానే దొరోని గుండాలు పోలీసులు
ఐలమ్మ ఇల్లు పై దాడి చేసి తగుల బెట్టారు.ఐలమ్మ భూమి కి పట్టా లేదని దేశముఖ్ తన పేరున రాయించుకున్నాడు.ఐలమ్మ ఈ విషయాన్ని కమ్యూనిస్ట్ నాయకుడు మరియు న్యాయవాది గా ఉన్న ఆరుట్ల లక్ష్మి నర్సింహా రెడ్డి కి కాలి నడకన జనగామ కి వెళ్లి తెలియచేసింది.ఐలమ్మ కు అండగా భీంరెడ్డి ఆరుట్ల వంటి నేతలు విస్నూర్ గడీ పైకి దాడి కి ప్రయత్నించగా వందలాది పోలీసులు గుండాలు ఈ నేతలను పట్టుకొని తీవ్ర చిత్రహింసలకు లోను చేశారు.దేశముఖ్ కొడుకు బాబు దొర అనేక సంఘం కార్యకర్తలని సజీవ దహనం చేసాడు.ఈ ఉద్యమం లో తన మరో కొడుకుని భర్తను కోల్పోయింది.
ఇన్ని చిత్రహింసల కొలిమి నిర్బంధాల మధ్య కూడా ఐలమ్మ చెక్కు చెదరలేదు.దొరకు లొంగలేదు.ఐలమ్మ కుటుంబ రక్షణకు కమ్యూనిస్ట్ పార్టీ అనేక మంది కార్యకర్తలను సాయంగా పంపించింది.తిరుపతి రెడ్డి వంటి అనేక కార్యకర్తలను పోలీసులు గుండాలు పొట్టన బెట్టుకున్నారు.ఐలమ్మ మొక్కవోని ధైర్యంతో ఉద్యమానికి పోరాటకారులకి ఊతమిస్తూ సాయుధ పోరాట విరమణ వరకు ఆ తర్వాత పార్టీ కార్యకర్తగా కొనసాగింది.బందగీ ,కొమురయ్య ఐలమ్మ లాంటి మట్టిమనుషుల ధైర్య సాహసాలు త్యాగాలు తెలంగాణ సామాజిక చరిత్రను గొప్ప ముందడుగు వేయించి రాచరిక భూస్వామ్య పాలనను తుదముట్టించాయి.

రష్యా లో జార్ చక్రవర్తుల రాచరిక పాలనను కూలదోయడంలో అక్కడ నీలోవిన వంటి తల్లులు పోషించిన పాత్రను తెలంగాణ లో ఐలమ్మ వంటి తల్లులు అనేక మంది పోషించారు.యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధమైన భవిష్యత్ తరాలకి ఉజ్వల భవిష్యత్ ను ఇవ్వడానికి అసమాన త్యాగాలు చేశారు.ఐలమ్మ మాటల్లో
సంఘం ఉన్నన్ని రోజులు ప్రజల దగ్గర భూములు ఉన్నయి,వాళ్లు తగ్గగానే మల్ల వాళ్ళందరూ గుంజుకున్నరు.కావున సంగం ఉంటేనే శ్రామిక కులాలకు మురిపెం,సంగం ఉంటనే సమంగా ఉండే రాజ్యమొస్తది .
ప్రజల సంపదను గుత్త పెట్టుబడిదారులకు అప్పచెప్తున్న ఈ కాలంలో ఐలమ్మ లాంటి అమ్మల అవసరముంది.వారి స్ఫూర్తిని నింపుకుని కొనసాగే బాధ్యత పౌర సమాజానికి ఉంది.ఐలమ్మ కొమురయ్య త్యాగాలను అపహాస్యం చేసిన మతోన్మాద ఫాసిస్ట్ రాజకీయాలకు నిలువ నీడ లేకుండా చేయడమే మనం వారికి ఇచ్చే ఘనమైన నివాళి
                                     

                                                                               ** అస్నాల శ్రీనివాస్
                                                                               అధ్యక్షుడు, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్

RELATED ARTICLES

Most Popular

Recent Comments