వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
బతుకమ్మ చీరలు, పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్ : సబండ కులాల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. సోమవారం ఐనవోలు మండలం పంథని, పున్నేలు, పెరుమాండ్లగూడెం, కక్కిరాలపల్లి, నందనం గ్రామాల్లో ఎమ్మెల్యే అరూరి రమేష్ పర్యటించి, 685 నూతన పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు, 6275 మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం సుమారు రూ. ఆరు కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింభమైన బతుకమ్మ పండుగ రోజున ప్రతీ ఇంట ఆడపడుచులు కొత్త చీర ధరించి సంబురాల్లో పాలుపంచుకోవాలని ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. ఐనవోలు మండలానికి సంబంధించి 17,047 బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 24 విభిన్న డిజైన్లు, 10 రకాల రంగులు, 240 రకాల సరికొత్త వెరైటీ చీరలను ఆడపడుచులకు అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 12 వేల కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని స్పష్టం చేశారు. వృద్ధాప్య పెన్షన్ వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఉస్మాన్ అలీ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చందర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి, అధికార ప్రతినిధి రవీందర్, సర్పంచులు పిడుగు రజిత యాదవ్, ప్రేమలత, దేవేందర్, రమేష్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సబ్బండ కులాల సంక్షేమమే సీఎం లక్ష్యం
RELATED ARTICLES
Recent Comments