Saturday, September 21, 2024
Homeటాప్ స్టోరీస్సూది గుచ్చి చంపుతుండ్రు..

సూది గుచ్చి చంపుతుండ్రు..

చావు తెలివి..?!
ఇంజిక్షన్ హత్యలు..

ఖమ్మంలో వెలుగులోకి వరుస ఘటనలు
మూడు రోజుల కిందట భర్తను చంపించిన భార్య..
రెండు నెలల కిందటే భార్యను చంపేసిన భర్త
ఆందోళనలో ప్రజలు..

చావు తెలివి కొత్తపుంతలు తొక్కుతోంది. హాయిగా బతకడానికి ఉపయోగపడాల్సిన ఉపాయం కొత్తకొత్త మరణదారులను వెతుక్కుంటోంది. ఆప్యాయతను, అనురాగాన్ని పూర్తిగా కప్పేసి, నటన మాటున తియ్యటి ‘విషాన్ని’ దింపుతోంది. తాత్కాలిక సుఖాల కోసం బంధాలను ‘సంకెళ్ల’తో శాశ్వతంగా బంధించుకుంటోంది. జీవితాంతం వెంటే ఉండాల్సిన తోడును తృణప్రాయంగా తుంచేస్తోంది. పర్యావసనాల సంగతి పక్కనే పెట్టిందో.., అసలు పట్టించుకోవద్దనే అనుకుందోగానీ సిరంజీ యమపాశమవుతోంది. అమృతాన్ని శరీరంలోకి తోసి ప్రాణాన్ని నిలపాల్సిన ‘సూది మందు’ విషాన్ని కక్కుతూ నిండు జీవిని నిలువునా అచేతనంగా పడేస్తోంది. ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా వెలుగు చూసిన ఇంజిక్షన్ హత్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

స్పాట్ వాయిస్, ఖమ్మం: చేయాల్సిన బాధ్యతలు తీరి ఓ జంట, ఇప్పుడిప్పుడే కొత్తదారులు వేసుకుంటున్న మరో జంట. నిండునూరేళ్లు ఒకరికొకరుగా తోడునీడగా ఉందామని బాసలు చేసుకున్న దంపతులు. ఇంటినిండా పిల్లాపాపలు, బంధువుల సందళ్లు, అయినవారి పలకరింపులతో హాయిగా రోజులు వెల్లదీయాల్సిన కాపురాలు. కానీ, వారి బుద్ధి వక్రీంచింది. నమ్మకం వారికి నాటకంగా మారింది. క్షణికాల కోసం తెగింపునకు తెరతీశారు. మనవాళ్లు అనుకునే మాట కూడా మరిచి చంపడమే పరిష్కారం అనుకున్నారు. అనుమానానికి తావు లేకుండా కొత్త పంథాను ఎన్నుకున్నారు. ప్రాణం కాపాడాల్సిన సూదిమందును హత్యకు ఆయుధంగా వాడుకున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా చేసి కటకటాలపాలై కొత్త మార్గంపై ఆలోచించేలా చేశారు. కాకతాళీయమో.., మరేమోగానీ ఇంజిక్షన్ హత్యలకు రెండింటికి ఖమ్మం జిల్లాయే వేదికైంది. మరో విషయం ఏంటంటే ఒక ఘటనలో బాధ్యతలన్నీ తీరిన భార్య భర్తను చంపిస్తే, మరో ఘటనలో పండంటి జీవితాన్నే ఊహించుకుంటూ ఏడడుగులు నడిచిన భార్యను భర్త స్వయంగా చంపేశాడు. మరో ట్విస్ట్ ఏంటంటే భార్యను చంపిన ఘటన జరిగి సుమారు రెండు నెలలు కావొస్తుంది. భర్తను చంపాలనుకున్న భార్య ప్లాన్ కూడా వర్క్ అవుట్ అయితే ఇది కూడా రెండు నెలల ముందే జరగాల్సిన మర్డర్ అయి ఉండేది.
బొప్పారంలో భర్తను చంపించిన భార్య..
చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. అతడి భార్య ఇమాంబీ మహిళా కూలీలను పనులకు తీసుకెళ్లే ముఠామేస్త్రీ. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెళ్లిళ్లు అయ్యాయి. ఎక్కడి వారు అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యారు. పెద్ద బాధరబందీలు ఏమీ లేవు. ఇమాంబీ స్వగ్రామంతో పాటు చుట్టుపక్కల ఊర్ల నుంచి మహిళలను కూలీ పనులకు తోడ్కెళ్లేది. ఈ క్రమంలోనే కూలీలను నిత్యం ఆటోలో తీసుకెళ్లే ఇమాంబీకి ఆటో డ్రైవర్ మోహన్ రావుతో అయిన పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. నాలుగేళ్లుగా సాగుతున్న ఈ ‘రంకు’ వ్యవహారం భర్తకు తెలియడంతో మందలించాడు. తట్టుకోలేకపోయిన ఇమాంబీ జమాల్ ను అడ్డు తొలగించుకోవాలని మోహన్ రావుతో కలిసి కుట్రకు తెరతీసింది. రెండు నెలల కిందట ఆర్ఎంపీ సాయంతో ఖమ్మంలోని ఓ మందుల దుకాణంలో అధిక మోతాదులో మత్తు మందు కొన్నారు. సమయం చూసి ఇమాంబీయే భర్తకు ఇంజిక్షన్ చేసి చంపాలని నిర్ణయించుకున్నారు. రెండు నెలలుగా ఇంట్లోనే మత్తుమందు ఇంజిక్షన్ తో అవకాశం కోసం చూస్తూనే ఉంది. కానీ అవకాశం చిక్కలేదు. ఇక చేసేది లేక జమాల్‌ను చంపేయాలని మోహన్ రావుపైనే ఒత్తిడి పెంచింది. ఇంజిక్షన్‌ను వెంకటేశ్ అనే మిత్రుడి ద్వారా మోహన్ రావుకు పంపించింది. ఏపీ రాష్ట్రంలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లి తీసుకెళ్లడానికి రావాలని భర్తకు పదేపదే ఫోన్ చేస్తూ బయలుదేరేలా చేసింది. ఈ క్రమంలోనే ఈనెల 19వ తేదీన బొప్పారం నుంచి గండ్రాయికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న జమాల్ మోహన్ రావు, వెంకటేష్, ఆర్ఎంపీ వెంకన్న బాణాపురం వద్ద కాపుకాచి బైక్ పై లిఫ్ట్ అడిగి వెనకాలే కూర్చుని విషాన్ని ఇంజిక్షన్ ద్వారా ఎక్కించి పరారయ్యారు. రెండు రోజుల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించి నిందితులను కటకటాలకు పంపించారు.

పెద్దతండాలో భార్యను చంపిన భర్త..
పెద్దతండాకు చెందిన భిక్షం అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. అతడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ గా, అనస్తీసియా డాక్టర్ కు హెల్పర్ గా పనిచేశాడు. మొదటి భార్య మేనకోడలే. ఆమెకు పిల్లలు కలుగకపోవడంతో నవీన అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నవీనకు మొదటిసంతానంగా ఆడపిల్ల పుట్టింది. కొద్ది రోజులు సాఫీగా సాగిన వారి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నవీన రెండోసారి గర్భం దాల్చి ప్రసవం కోసం గత జూలై నెలలో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు డెలివరీకి తీసుకెళ్లాడు. తన మేనకోడలపై ఉన్న ప్రేమతో నవీననే అంతం చేయాలనుకుని పథక రచన చేసి ఆస్పత్రియే అందుకు సరైన వేదికగా ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకుంటాడు. భార్య రెండో సంతానంగా కూతురు పుట్టిన తర్వాత ఆ రాత్రే భిక్షం స్వయంగా అధిక మోతాదులో మత్తు ఇంజిక్షన్ ఇచ్చి భార్యను చంపేస్తాడు. ఆ తర్వాత ఆస్పత్రి ఎదుట తీవ్రంగా నిరసనకు దిగి ఒక రకంగా యాజమాన్యాన్ని బెదిరించి పరిహారంగా కొంత సొమ్ము తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను చూసిన వైద్యులు అసలు విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భిక్షం వ్యవహారం బయటపడుతుంది.

బొప్పారం ఘటనతో ఐదు కుటుంబాలు ఆగం..
ప్రియుడి మోజులో పడి భర్తను చంపించిన బొప్పారం ఘటనతో ఐదు కుటుంబాలు ఆగమయ్యాయి. భర్త జమాల్ ను పోగొట్టుకుని భార్య ఇమాంబీ , ఆమె ఇద్దరు కూతుళ్లు దిక్కులేని వారికాగా, ప్రియురాలి మోజులో పడి ఆటో డ్రైవర్ మోహన్ రావు ఊచలు లెక్కపెడుతున్నాడు. అతడికి సహకరించిన పాపానికి మరో డ్రైవర్ వెంకటేశ్, ఆర్ఎంపీ వెంకట్, మత్తు మందు విక్రయించిన మరో వ్యక్తి జీవితాలను చీకటి చేసుకున్నారు. అలాగే పెద్దతండాకు చెందిన భిక్షం కూడా తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. భార్యలు, పిల్లలతో గడపాల్సిన వయస్సులో చావు కుట్రకు పోయి కాపురాన్ని బజారును వేసుకున్నాడు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments