గుర్రాలు.. రౌతు..
పోగొట్టుకున్న చోటే వెతుకడమా..?
వెతుకడానికి పోగొట్టుకోవడమా..?
వెతుకులాటలో నమ్మకం ఎంత..!
నమ్మించే ఆటలో వెతుకులాటుందా.. !
పాలకులే గెలుపు గుర్రాలు..
రౌతులు మాత్రం ప్రజలే..
పాతాళ గరిగెతో బావిలో పడిన బొక్కెన (బకెట్) తీయడానికి నానా విధాలుగా యత్నం. నీళ్లలో మునిగి బావి అడుగున ఆసీనురాలైన బొక్కెనను దక్కించుకోవడానికి అందాజ కొద్ది గరిగె విసిరి కొండికి చిక్కేలా చేసే విశ్వ ప్రయత్నం. కొనకు చిక్కేది చిక్కనిది తెలియని సందిగ్ధంలో గరిగెను బయటకు నెమ్మదిగా లాగడం.., నీటి పైకి వచ్చిన తర్వాత ఏమీ చిక్కలేదని చూసి మళ్లీ బలంగా నీటిలోకి గరిగెను విసరడం. బొక్కెన చిన్నదే అయినా, దానిని లాగే తాడు మాత్రం పెద్దదిగానే ఉంటుంది. గరిగెకు ఏ చిన్న కొస చిక్కినా ఇట్టే బొక్కెనను బయటకు లాక్కొస్తుంది. కానీ లాగే వరకు ఓపికగా గరిగెను నీటిలో గిరిగిరా తిప్పడమే ఓ పరీక్ష. ఎన్నో కోలల నీటిలో చిక్కుకున్న బొక్కెనను బయటకు తీసుకొస్తామనే నమ్మకం ప్రేరణ అయితే.., ఓపికగా ఎన్నిసార్లయినా గరిగెను పైకి లాగుతూ నీటిలోకి వదులుతూ పట్టుకోవడానికి చేసే యత్నం విజయుడికి ముఖ్య లక్షణం. ఈ ప్రయత్నంలో ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా చిక్కిన బొక్కెన కూడా మధ్యలోనే జారిపోయి నీళ్లలోనే మునుగుతుంది. బొక్కెన కథ మళ్లీ మొదటికే వస్తుంది.
నిరాధారణ ఉన్న చోటు నుంచే నిరూపణల ప్రదర్శన మొదలవుతుంది. నిందారోపణలు ఉన్న కాడే నిజాలూ పొరలు కప్పబడి ‘పిలిస్తే పలుకుదాములే,,’ అనేలా కాచుక్కూర్చుంటాయి. కళ్లముందు కనిపించేది ఖచ్చితంగా సత్యం కాదనిపిస్తున్నా.., ఖండించడానికి అవకాశాలు కప్పేయబడి ఉన్నా అన్నీ తేలడానికి ఒక్క ఆధారం కావాలి. అవకాశం కోసం ఎదురు చూసే ఆధారం సమయం కోసం పరితపిస్తూ, సరైన టైమ్ రాగానే నిజ ప్రదర్శన జరిగి, పెరిగిన పొరల తాలూకు భ్రమలు తొలగి అన్నీ కళ్లముందు స్పష్టంగా కదలాడుతాయి. ఆరోపణలు., అనుమానాలు., నిందలు.., నిజాలు దేనికవిగా తమ నిజ రూపాలను చూపెడుతాయి. ఏది ఏమైనా ఎవరైనా పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలి. రాబడి ఉన్న చోటే పోగవ్వాలి. తామున్నది వాడకానికి కాదని, వాడి పడేసే వస్తువులు అంతకన్నా కాదని, ఎంతో ‘వాడి’ గలవారిమే అని నిరూపించాల్సిన అవసరం తప్పకుండా ప్రజలపైనే ఉంది.
నమ్మిన వారిని నట్టేట ముంచుతూ, నలు సంద్రాల అవతలున్న వారిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకోవడమే విస్తుగొలుపే విషయం. నమ్మి మునిగామని మీ వారు అనుకున్నట్టే, మా వంతు వస్తుందేమోనని అక్కడి వారు కూడా అనుమానించే అవకాశాలూ లేకపోలేదు. నమ్మించడం చెప్పుకోదగ్గ విషయమే కావచ్చు.., గానీ నమ్మినట్టు నటించడం కూడా అంతకన్నా గొప్ప విషయమే. కోల్పోయిన నమ్మకాన్ని వెతుక్కునే పనిలో పడ్డావని ఇక్కడి వారనుకున్నా.., బావిలో పడిన పాత బొక్కెనను వెతకడం.. వదిలిన పాతాళ గరిగె కొత్తగా కనిపిస్తున్నా దానిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నదని అక్కడి వాళ్లు గమనించినా ‘మునక’ ఖాయం., మొదటికే మోసం..
నాయకుడికి సేవా గుణం మహా మంచిది. చేతనైన సాయం చేయాలనుకోవడం మరీ గొప్పది. గిరిగీసుకుని పనిచేయకుండా, బరితెగించి సేవ చేస్తే ఆ ప్రజల కన్నా అదృష్టవంతులెవరుంటారు. కానీ, ముందు అయిన వాళ్ల ఆకలి తీర్చాలి. కడుపు నింపకున్నా కనీసంగా కళ్లు తిరిగి పడిపోకుండానైనా నిలబడి ఉండే ఓపిక వరకైనా భోజనం పెట్టాలి. ఆ తర్వాత బయటి వారి పరిస్థితి ఆలోచించాలి. అంతేగానీ నకనకలాడుతున్న పొట్టలను చూసి కూడా నిండాయనుకుంటే చేసేదేముంటది. ఆర్తనాదాలను జయధ్వానాలుగా భావించి, అవసరాలు తీరాయనుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.
ఉత్తర ప్రయాణం ఊపందుకుంది. కారు వేగంగా దేశమంతా చక్కర్లు కొడుతూనే ఉంది. ఇక్కడ కూరుకుపోయిన విషయాన్ని వదిలేసి., ఎక్కడో వెతుక్కునేందుకు పడుతున్న ఉబలాటంపైనే ఇప్పుడు చర్చంతా. అవసరం ఉందంటే ఎక్కడైనా ఆదరణ తప్పకుండా ఉంటుంది. కానీ అవసరాలు తీర్చుకోవడానికే వలసలు పోతానంటేనే ధిక్కారం తప్పదు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు పీకల్లోతూ కష్టాల్లో ఉన్న మాట అందరికీ వాస్తవంగా అనిపించకపోవచ్చుగానీ అబద్ధం మాత్రం కాదు. రెండో విడత టీఆర్ఎస్ సర్కార్ పనితీరుపై పెదవి విరుస్తున్న విషయం కూడా కొందరికి అబద్ధం అనిపించినా కొంతైనా అంగీకరించక తప్పని నిజం.
లోపాలు ఎవరికైనా సహజమే. కానీ, వాటిని ఇతరులకు ఆయుధాలుగా మలిచి కారు పార్టీ లేని చిక్కులు కొనితెచ్చుకుంటున్నది. చర్యలతో విమర్శకులకు కనువిప్పు కలిగించేలా చేయాల్సిందిపోయి చర్చలకు తావిస్తూ కొత్త వివాదాలు సృష్టించుకుంటున్నది. అన్నింటా ఆగమవుతూ ‘నీవు నేర్పిన విద్యే గదా నీరజాక్షా..’ అన్నట్టుగా తనను తాను పలుచన చేసుకుంటున్నది. ఉద్యమపార్టీగా ఉవ్వెత్తున ఎగిసి, ఉదుటున రాష్ట్రాన్ని సాధించిపెట్టిన పెద్దలు ఇప్పుడు చిన్నబుచ్చుకునే పనులకు శ్రీకారం చుట్టడం విస్మయం కలిగిస్తోంది. అందునా ఇతర పార్టీలకు లేని ఊతమిస్తూ తనకు తానుగా స్వయంకృతం ప్రకటించుకుంటున్నది. మచ్చగా, మచ్చుకుగా కనిపించే వారికి ప్రజల్లో మెచ్చుకోలు మిగిలేలా చేస్తున్న గొప్పతనం స్వరాష్ట్ర పార్టీదే.
ప్రజలు ఎక్కడివారైనా ప్రజలే. నీతి అందరికీ ఒక్కటే. ఎంతటి వారికైనా అవసరం అదే. నిన్నే నమ్ముకున్న వారు ఎందరో. ఇప్పటికే చేస్తున్నది ఎంతో అయి ఉండొచ్చు. కానీ అదే చాలా.? చాలా… అని మనకనిపించడం మంచిదే కానీ, చాల్లేదు.. అని వారికనిపిస్తేనే ప్రమాదం. ఎవరెన్ని చేసినా, ఎంతగా భ్రమలు కల్పించినా చివరకు పాతాళ గరిగె ఉన్నది ప్రజల చేతిలోనే. నీటి అడుగున నిక్షిప్తమైనన ప్రజాస్వామ్యాన్ని కొక్కానికి తట్టించుకుని ఎప్పుడు ఎలా బయటకు తీయాలో బాగా తెలిసిన నేర్పరులు ఓటర్లే. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం పాలకులకు ఎంత బాగా తెలుసో.., ప్రజలకూ అంతకన్నా ఎక్కువే తెలిసిన విషయం. కానీ, దేనికైనా సమయం రావాలి.., సందర్భానుసారంగా తమ స్థాయేంటో చూపించుకునే అవకాశం చిక్కాలి. అప్పుడే పాలకులు గెలుస్తారు.., ప్రజలు విజయ కేతనం దక్కించుకుంటారు.
ఓటమి ఓడుగాకా..
గెలుపు వర్థిల్లు గాకా..
-చేలిక రాజేంద్రప్రసాద్
స్పాట్ వాయిస్, ఎడిటర్
Recent Comments