స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: ప్రజలకు మేలుచేసే సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీని చూసి తెలంగాణ ప్రజలు బీజేపీలో చేరుతున్నారని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. పర్వతగిరి మండలంలోని చెరువుకొమ్ము తండా గ్రామంలో కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 400 మంది యువకులు, మహిళలు, పెద్దలు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండేటి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, దానిలో భాగంగానే గ్రామాల్లో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతీ ఇంటికీ మరుగుదొడ్లు వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో పార్టీలో చేరికలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, మండల ఇన్ చార్జి, దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బన్నా ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు కుడికాల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి దేవేందర్, ఉపాధ్యక్షులు వినోద్, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రవణ్, మండల అధ్యక్షుడు గొల్లపల్లి సంతోష్ కుమార్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు నితిన్, నరేష్, హేమ, అనిల్, తిరుపతి పాల్గొన్నారు.
Recent Comments