Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్వీల్ చైర్ పై మృతదేహం తరలింపు..

వీల్ చైర్ పై మృతదేహం తరలింపు..

క్షమించు తల్లీ…!

అంబులెన్స్ లేక ఆస్పత్రిలోనే మృతదేహం
గంటల తరబడి వీల్ చైర్ పైనే..
యువకుల సాయంతో స్వగ్రామానికి..
యూత్ ను అభినందించిన స్వచ్ఛంద సంస్థలు..

ఇంట్లో మనిషి చనిపోయిన బాధకంటే, మృతదేహాన్ని కళ్లెదుటే పెట్టుకుని అచేతనంగా నిరీక్షించాల్సిన దుస్థితి రావడం అత్యంత విషాదకరం. ప్రాణాలు కాపాడుకోవాలని ఆస్పత్రికి తీసుకొచ్చిన మనిషి తిరిగిరాని లోకాలకు వెళ్లారని తెలిసి గుండెలవిసేలా ఏడ్చే కుటుంబసభ్యులు, బంధువులకు ఆ శవాన్ని ఇంటికి తీసుకెళ్లడం మరో సమస్యగా మారితే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లడానికి కావాల్సిన అంబులెన్స్ లేకపోవడంతో గంటల తరబడి వీల్ చైర్ లోనే పెట్టి సాయం కోసం ఎదురుచూసే క్షణాలు ఆ కుటుంబాన్ని ఎంతగా హింసించి ఉంటాయో.  కిలో మీటర్ దూరానికే రూ.10వేలు అడిగిన మనషులను ఏమనాలో…  మనిషే పోయాడని బాధపడాలా.. ఇంటికెలా తీసుకెళ్లాలని ఆలోచించాలో అర్థం కాక అచేతనంగా గడిపిన ఆ రక్తసంబంధీకుల హృదయ ఘోష అంతాఇంతా కాదు. మహబూబాబాద్ జిల్లా గార్లలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి సంబంధీకులనే కాదు చూపరులను కూడా కన్నీరు పెట్టించింది.
స్పాట్ వాయిస్, బయ్యారం

 

ఎంత నరకం..

కళ్లముందు చనిపోయిన వ్యక్తి.. కంటికి కనిపించనంత దూరంలో చేరుకోవాల్సిన ఇల్లు. ఆస్పత్రి పరిసరాల్లో జాడపత్తా లేని అంబులెన్స్. ఆ తల్లిని ఇంటికెలా తీసుకెళ్లాలో తెలియని దుస్థితి. ఏమీ చేయలేక వీల్ చైర్ లోనే పెట్టుకుని నిరీక్షించాల్సిన పరిస్థితి. చైర్ చుట్టూ బంధువులు, ఆప్తులు మృతదేహాన్ని చూస్తూ మౌనంగా రోదిస్తున్న హృదయవిదారకమైన దృశ్యం శనివారం గార్ల ప్రభుత్వాస్పత్రిలో కనిపించింది. వివరాలిలా ఉన్నాయి… మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన అర్మూరి పద్మ అనారోగ్యంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి అక్కడే మరణించింది. అయితే పద్మ శవాన్ని ఇంటికి తీసుళ్లడానికి హాస్పిటల్ లో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో వీల్ చైర్ లోనే గంటల తరబడి పెట్టుకుని నిరీక్షించారు. ప్రైవేట్ వాహనాల యజమానులను ఆశ్రయిస్తే కేవలం కిలోమీటర్ దూరానికే రూ.10 వేలు డిమాండ్ చేశారు. అంతగా ఇచ్చుకోలేని నిస్సాహాయ స్థితిలో ఉన్న మృతురాలి బంధువులు, కుటుంబీకుల బాధను చూసి కొందరు యువకులు ముందుకొచ్చారు. చేసేదేమీ లేక అదే వీల్ చైర్ లో ఇంటికి తీసుకెళ్లడానికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

మృతదేహంపై దుప్పటి కప్పి దారెంటా తోసుకెళ్తుంటే చూపరులు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. హృదయాలను మెలిపెట్టే ఈ దృశ్యాన్ని చూసి స్థానికులంతా తీవ్రంగా కలత చెందారు. తల్లీ క్షమించు… నీకు ఇంతకన్నా ఏమీచ్చుకోలేమని పలువురు పేర్కొనడం గమనార్హం.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments