Monday, November 25, 2024
Homeటాప్ స్టోరీస్ఖాళీ అవుతున్న తూర్పు కారు..!

ఖాళీ అవుతున్న తూర్పు కారు..!

త్వరలోనే.. జంప్…
లెక్క క్లియర్..

గులాబీ నుంచి కమలానికి ‘దూకుడు…’
16 మంది తాజాలు.. ఐదుగురు మాజీ కార్పొరేటర్లు..
తూర్పు నియోజకవర్గంలో బీజేపీలో చేరికకు అన్నీ సిద్ధం…
తెరవెనుక తతంగం ఇప్పటికే పూర్తి..
మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా చేరికలు..

‘తూర్పు’కు తిరిగి దండం పెట్టాల్సిందే. గత వైభవాన్ని లెక్కించుకుంటూ గండాన్ని దిగమింగుకోవాల్సిందే. త్వరలోనే వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి 16 మంది తాజా కార్పొరేటర్లు., ఐదుగురు మాజీలు కారు దిగి కమలం గూటికి చేరడానికి ‘అన్ని మార్గాలు’ సిద్ధం చేసుకున్నారు. అందుకు సంబంధించి తెర వెనక తతంగం అంతా ఇప్పటికే ముగిసింది. ఇక వారంతా తెరముందుకొచ్చి ముఖాలు చూపడమే తరువాయిగా మిగిలింది. ఆ మాటకొస్తే, అంతా అనుకున్నట్టుగా జరిగితే మొన్నటి ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశంలోనే ఈ చేరికలు జరగాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. అయినా.., ఆలస్యం అమృతం విషం.. అన్నట్టుగా.. అది కూడా బీజేపీకి లాభించి అప్పుడు వెళ్తారనుకున్న 13 మందికి మరో ఎనిమిది మంది చేరి అది కాస్త ఇప్పుడు 21కి చేరింది. ప్రస్తుతానికి బలమైన ‘కోట’కు బీటలు వారుతున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తుండగా, మున్ముందు ఇంకెంత అగాథంగా మారుతుందో కాలమే తేల్చాలి.
_స్పాట్ వాయిస్, ప్రధాన ప్రతినిధి

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నాయి. గులాబీ కార్పొరేటర్లు పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు ‘దారులు’ వేసుకుంటున్నారు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని కాస్తలో కాస్తైనా ఒంటబట్టించుకుని తమ దీపాలు ఆరిపోకుండా చూసుకోవడానికి ‘పక్కచూపులు’ చూస్తున్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి 16 మంది కార్పొరేటర్లు, మరో ఐదుగురు మాజీ కార్పొరేటర్లు త్వరలోనే బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించిన అన్ని ‘ఫార్మల్టీలు’ పూర్తి అయినట్టు సమాచారం.

గులాబీ నుంచి కమలానికి ‘దూకుడు…’
వరంగల్ తూర్పు నియోజకవర్గంపై కమలం పార్టీ పట్టు పెంచుతోంది. ఇప్పటికే ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీలో చేరారు. మొన్నటి ప్రజా సంగ్రామ యాత్రతో నియోజకవర్గంలో కషాయం దండు భారీగా తరలివెళ్లి సవాల్ విసిరింది. ఇప్పటికే యువనాయకుడు గంటా రవికుమార్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసుకుని స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. వీటన్నింటికీ కలిసొస్తుందా అన్నట్టుగా స్థానిక ఎమ్మెల్యే పనితీరుతో కూడా విసిగిపోయిన పలువురు కార్పొరేటర్లు గులాబీ గూటిని వీడి బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారు.

16 మంది తాజాలు.. ఐదుగురు మాజీ కార్పొరేటర్లు..
వరంగల్ తూర్పులో మొత్తం 24 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. అందులో నుంచి ఇప్పుడు 16 మంది కార్పొరేటర్లు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. వారితో పాటు ఐదుగురు మాజీ కార్పొరేటర్లు కూడా గులాబీ నుంచి బీజేపీలో చేరి తమ ఉనికిని చాటుకోవడానికి ఉబలాటపడుతున్నారు. సొంత పార్టీలో ఇమడలేక, కనీసంగా పనులు కూడా చేయించుకోలేని స్థితిలో ప్రజలకు ఎక్కడ దూరమవుతామేననే భయంతో వారు జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటికే వారంతా బీజేపీ ప్రధాన నాయకులతో సంప్రదింపులు జరుపుకుని ప్లాట్ ఫాం రెడీ చేసుకున్నారు. సరైన ముహూర్తం కోసం వేచిచూస్తూ కారు రాం..రాం.. పలికి., కమలం కండువా కప్పుకోవడానికి వేచి చూస్తున్నారు.

నడుమ నలుగుడే…
నారీనారీ నడుమ మురారీ అన్నట్టుగా తయారైంది తూర్పులోని పలువురు కార్పొరేటర్ల పరిస్థితి. డివిజన్లలో సమస్యలు పరిష్కరించాలన్నా, పనులు చేయించాలన్నా నిధులు కావాలి. నిధుల మంజూరుకు ముందు ఉండే ఒక స్పష్టమైన విధానాన్ని అమలు చేయడంలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఎమ్మెల్యే నరేందర్ కు ఎదురు చెప్పలేక, ఇటు మేయర్ దగ్గరికి వెళ్లే సాహసం చేయలేక నలిగిపోతున్నారు. దీంతో ఏ పనులు చేయలేక నిస్సహాయులుగా మారుతున్నారు. ఆ విషయానికి వస్తే.. అంతెందుకు మొన్నటికి మొన్న జరిగిన నగర బాటే ఓ మంచి ఉదహరణ. బల్దియా మేయర్, గ్రేటర్ కమిషనర్ నగర బాట కార్యక్రమంలో భాగంగా డివిజన్ పర్యటనకు వస్తున్నారు, సమస్యలేమైనా ఉంటే జాబితా సిద్ధం చేసుకుని ఉండండి.. అని సీసీ కార్పొరేటర్లకు సమాచారం చేరవేశారు. కానీ ఎమ్మెల్యే ఏమనుకుంటారో అనే భయంతో పలు డివిజన్ల కార్పొరేటర్లు నగర బాట కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. స్థానికంగానే ఉన్నా నగరబాట కార్యక్రమానికి వెళ్తే ఎమ్మెల్యే ఏమంటాడో అనే సంశయంతో ఆగిపోయారు. దీంతో డివిజన్ సమస్యలను ఏకరువు పెట్టుకునే అవకాశాలన్ని పోగొట్టుకున్నారు. అదే సమయంలో పర్యటనకు వెళ్లిన కమిషనర్, మేయర్ కార్పొరేటర్ లేకపోవడంతో ‘‘అంతా బాగానే ఉండి ఉంటుందిలే..’’ అనుకుని కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి వచ్చిన దారిలో వెళ్లిపోయారు. దీంతో ఇటు ఎమ్మెల్యే మాట కాదనలేక, అటు మేయర్ దగ్గర వెళ్లలేక నలుగుతున్న కార్పొరేటర్లు గెలిపించిన ప్రజలకు ఏమీ చేయలేక పోతున్నామే.. అని దగ్గరి వారి వద్ద నిరాశ నిస్పృహలను వ్యక్తం చేసిన ఘటనలూ ఉన్నాయి.

బుజ్జగించినా.. తగ్గేదెలే..
ఈనెల 27వ తేదీన ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. దానికి ముందు రోజే 13 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు రహస్యంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అదీ కాకుండా బీజేపీ మీటింగ్ రోజు కూడా మరో విడత కార్పొరేటర్లంతా సమావేశమై చర్చలు కొనసాగించిన విషయం తెలిసి ఎమ్మెల్యే వెళ్లి బుజ్జగించినట్టు సమాచారం. అయినా సదరు కార్పొరేటర్లు తమ నిర్ణయాన్ని గట్టిగానే ప్రకటించినట్టు తెలుస్తోంది. పలు విడతలుగా వారితో రాయబారాలు నెరిపినా వారు కరిగే దాఖలాలు లేవనే తేలినట్టు స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు. ఏదిఏమైనా త్వరలోనే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి భారీగా కార్పొరేటర్లు, మాజీ ప్రముఖులు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు మాత్రం ఖాయమని తేలిపోయింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments