Saturday, November 23, 2024
Homeతెలంగాణతుర్పు కార్పొరేటర్ల రహస్య భేటీ

తుర్పు కార్పొరేటర్ల రహస్య భేటీ

తూర్పులో మార్పు తప్పదా..?..
13 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్ల రహస్య సమావేశం..
నేడు బీజేపీలో చేరేందుకు ఇద్దరు సిద్ధం..!
ఎమ్మెల్యేపై అసహనమే కారణామా..?
భవిష్యత్ ను చూసుకునే కార్యాచరణా..?
తూర్పు టీఆర్ఎస్ లో తీవ్ర ఉత్కంఠ

ఇప్పటికే ఉడుకుతుంటే మరింత మంట రాజేస్తున్న చర్యలు. అస్సలే పరిస్థితులు బాలేవు అనుకుంటుంటే ఇంకింత ఇరుకున పెడుతున్న ఘటనలు. గులాబీకి, కమలానికి మధ్య మండుతున్న రాజకీయ వేడిలో రోజుకో మలుపు.. పూటకో గందరగోళం. అలాంటి టైంలో తూర్పును ప్రస్తుతం ఇంకో పిడుగు. బీజేపీ బహిరంగ సభ మరో 24 గంటల్లో ఉందనగా 13 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్ల రహస్య సమావేశం. ఎందుకై ఉంటుంది.., దాని వెనక మతలబు ఏమై ఉంటుందనే చర్చ.

స్పాట్ వాయిస్, వరంగల్: తూర్పులో వలసలు మొదలయ్యాయా.. గులాబీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారా..? ఎమ్మెల్యే తీరుపై అసహనం వెలువెత్తుతోందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీజేపీ పాదయాత్ర ఓరుగల్లుకు రావడం, కారు నుంచి కీలక నేత కాషాయం కండువా కప్పుకోవడంతో ఇక్కడ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తూర్పు నియోజకవర్గంలోని 13 మంది కార్పొరేటర్లు శుక్రవారం రహస్యంగా భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే నన్నపునేని తీరు, తూర్పులో జరుగుతున్న రాజకీయ సమీకరణలపై తీవ్ర స్థాయిలో చర్చించినట్లు తెలిసింది.

ఎమ్మెల్యేపై అసహనం..!
తూర్పు నియోజకవర్గంలోని 13 మంది కార్పొరేటర్లు సమావేశం కావడం ఇప్పుడు వరంగల్ రాజకీయాల్లో చర్చగా మారింది. ఎమ్మెల్యే ఒటెత్తు పోకడలు, ప్రతీ పనిలో ఎమ్మెల్యే ఎంట్రీ ఇవ్వడం, కార్పొరేటర్లపై పెత్తనం చెలాయించడం, కమీషన్లు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే తీరు వల్ల తమకు ఎలాంటి లాభం లేకుండా పోతుందని, కనీసం తమ డివిజన్లలో గుర్తింపు లేకుండా పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల నన్నపునేని జన్మదిన వేడుకల అంశం కూడా వారి మధ్య నడిచినట్లు సమాచారం. కార్యకర్తల సంబురం కోసం చేసుకున్న వేడుకలో ఎమ్మెల్యే హాజరై ఘాటు వ్యాఖ్యలు చేయడం, తదనంతరం తూర్పులో జరిగిన రాజకీయ మార్పులపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే తీరు ప్రతిపక్షాలకు బలాన్ని చేకూరుస్తున్నాయని మాట్లాడుకున్నట్లు తెలిసింది.

నిన్న రహస్య భేటీ.. నేడు బీజేపీ మీటింగ్..
బండి సంజయ్ పాదయాత్ర శనివారం వరంగల్ కు చేరుకొనుంది. దీనికితోడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీలో చేరారు. ఈక్రమంలో 13 మంది కార్పొరేటర్లు సమావేశం కావడం, నేడు బీజేపీ సభ ఉండడంతో పార్టీ మారుతారా అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సభకు ఒక్క రోజు ముందే తూర్పులో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని అటువైపు తిప్పింది.

ఇద్దరు కార్పొరేటర్ల చేరిక..!
తూర్పు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు బీజేపీ బహిరంగ సభలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే తీరు నచ్చకపోవడంతో.. కారు దిగిపోతున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా కాషాయం తీర్థం పుచ్చుకునే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తూర్పులో గులాబీ కోట నేలమట్టం అయ్యే అవకాశం లేకపోలేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments