పనులు పాతరేసి పైసలు మాత్రం దొబ్బుడే..
నగరంలో అంతటా నాసిరకం నిర్మాణాలే
బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి
స్పాట్ వాయిస్, ఎన్జీవోస్ కాలనీ : ఏ పనిచేసినా ఎంతొస్తుంది అనే లెక్కలు తప్ప ఎన్నేళ్లు నిలుస్తుంది అనే సోయి లేదని, కమీషన్లే టార్గెట్ గా పనులు అప్పగిస్తూ ఏమీ పట్టించుకోకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వడ్డేపల్లి 58వ డివిజన్ ఎస్సీ శ్మశానవాటిక ప్రహరీ కూలిపోగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో ఎక్కడ ఏ పని మొదలు పెట్టినా, ఏ నిర్మాణం చేపట్టినా పూర్తి అయిన నుంచి ఎన్ని రోజులు ఉంటుందోనని లెక్కలు పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. గోడ కూలినా టీఆర్ఎస్ నాయకులు అటుగా వెళ్లి చూసిన పాపాన పోవడం లేదని దుయ్యబట్టారు. నాసిరకమైన ఇసుక, సిమెంట్ తో నిర్మాణం చేయడం వల్లే గోడులు కూలిపోతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నాణ్యమైన నిర్మాణాలు చేయాల్సి ఉండగా నాసిరకమైన నిర్మాణాలు చేపట్టడం వారికే చెల్లిందని దుయ్యబట్టారు.
టీఆర్ఎస్ నేతలకు ఏ పనిలో ఎంత వస్తుంది అన్న సోయి తప్ప చేపట్టిన పనులను సక్రమంగా చేయించాలనే సోయి లేదన్నారు. నగరం లో అంతర్గత రోడ్లు కూడా నాసిరకంగా చేపట్టడం వల్ల మొత్తం గుంతలమయం అయ్యి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు మంజూరు చేస్తే వాటిని పూర్తిగా దారి మళ్లించడం, నగర అభివృద్ధి ని చాపలా చుట్టి మూలకు పెట్టుడు తప్ప ఏమీ చేయడం లేదన్నారు. సీఎం దగ్గరికి వెళ్లి అయ్యా మా వరంగల్ పరిస్థితి ఏంటి.., మా నిధులు ఎవ్వి అని అడిగే ముఖమే లేదని దుయ్యబట్టారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే కమీషన్లకు కక్కుర్తి పడకుండా నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే కాంట్రాక్టుల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంటనే ప్రహరీ నిర్మాణం చేపట్టాలని కమిషనర్ ను కోరుతాం అన్నారు. ఆయనతో పాటు హన్మకొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు జన్ను మధు, జిల్లా కార్యదర్శి నల్ల రమేష్, 57వ డివిజన్ ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి, మరికొందరు బీజేపీ నాయకులు ఉన్నారు.
కమీషన్లు తప్ప ఏమీ వద్దా..
RELATED ARTICLES
Recent Comments