Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలుకేంద్ర ప్రభుత్వ పతనం ఖాయం..

కేంద్ర ప్రభుత్వ పతనం ఖాయం..

రైతాంగ ఉద్యమ హామీలను విస్మరిస్తున్న కేంద్రం
పంటల కనీస మద్దతు ధరల చట్టం చేయాలి
ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో నర్సంపేట లో రాస్తారోకో
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న మోడీ ప్రభుత్వ పతనం ఖాయమని ఏఐకేఎఫ్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబ బాబురావు అన్నారు. ఆదివారం నర్సంపేట పట్టణంలో ఓంకార్ విగ్రహం ఎదుట రాస్తారోకో నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఓట్లు, సీట్లు అధికారమే ధ్యేయంగా మభ్యపెట్టే హామీలతో పబ్బం గడుపుతూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. రైతాంగానే రక్షించి, దేశాన్ని కాపాడాలని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఉద్యమించిన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులపై పెట్టిన కేసులను నేటికీ ఎత్తివేయకపోగా లకింపూర్ ఘటనలో రైతులపై వాహనాలను ఎక్కించి నలుగురు రైతుల మృతికి కారణమైన వ్యక్తులపై కనీస చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దుచేసి ఎంఎస్పీ, రుణ విముక్తి చట్టాలను పార్లమెంటులో ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ఏఐకేఎఫ్ డివిజన్ కార్యదర్శి సంగతి మల్లికార్జున్, జిల్లా నాయకులు నాగెల్లి కొమురయ్య. ఏఐఎఫ్ డీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వంగాల రాగసుధ, కొమురయ్య, మేకల యాదగిరి, బత్తిని కుమారస్వామి, తడుక కౌసల్య, ఎండీ రాజా సాహెబ్, వెంకటయ్య, సూరయ్య, మహేష్, ‌శ్రీకాంత్, సాయి, ‌జయ, సునీత, ప్రవళిక, శారద, జ్యోతి, లక్ష్మీ, విజయ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments