గలగలా పారుతున్న గణపురం చెరువు
30 అడుగులు దాటిన నీటిమట్టం
ఆయకట్టు రైతుల సంబురం
స్పాట్ వాయిస్, గణపురం: వారం రోజులుగా కురుస్తున్న వరుస వర్షాలకు మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు పొంగిపొర్లుతున్నది. ఈసారి వర్షాకాల సీజన్ ముందే ప్రారంభం కావడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు 30 అడుగుల సామర్థ్యం ఉన్న గణసముద్రం పూర్తిగా నిండి అడుగు ఎత్తుతో అలుగు పోస్తూ జలసవ్వడి చేస్తున్నది. సాధారణంగా ఈ చెరువు ఒక్కసారి అలుగు పోయడం మొదలైతే నెల రోజులపాటు మత్తడి దూకుతూనే ఉంటుంది. అయితే ముందస్తు వర్షాలతోనే మత్తడి పోస్తుండడంతో దసరా వరకు ఈ అద్భుతం కొనసాగుతుందని గ్రామస్తులు అంటున్నారు. ప్రస్తుతం ఈ చెరువుమత్తడి దూకుతుండడంతో రైతులు, పలు గ్రామాల ప్రజల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. మత్తడి పడుతున్న విషయం తెలియడంతో వివిధ గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు, గ్రామస్తులు చెరువు వద్దకు బుధవారం పెద్ద సంఖ్యలో చేరుకొని మత్తడిని పరిశీలించారు. ఈ ఏడాది చెరువు నిండుతుందని అనుకోలేదని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదనీరు చేరి అలుగు పడుతుంటే ఆనందగా ఉందని పలువురు పేర్కొన్నారు. 30 అడుగుల ఎత్తు నుంచి మత్తడి నీరు జాలువారుతుండగా పర్యాటకులు ఆ సుందర మనోహర దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వెంట వెళ్తున్న ప్రయాణికులు వాహనాలను నిలిపి, గలగలా పారుతున్న మత్తడి నీటి వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.
గణప సముద్రం..మత్తడి దునికే
RELATED ARTICLES
Recent Comments