‘తూర్పు’ కారులో కల్లోలం
-ముఖ్యనేతల కూడలిలో పార్టీకి ముసలం..
-స్వపక్షంలో విపక్షం
-ఉద్ధండుల నడుమ రసవత్తర ఆట
-ఎవరి బాట వారిదే..
-పావులవుతున్న పార్టీ శ్రేణులు
-ఎమ్మెల్యే గ్రూపు రాజకీయాలపై కీలక నేతల బహిరంగ వ్యాఖ్యలు
-స్వప్రయోజనాల కోసం పార్టీనే వాడుకుంటున్నాడనే విమర్శలు
-కార్పొరేటర్లు మేయర్ కు సహకరించకుండా మోకాలడ్డు
-పార్టీలో చేర్చుకుని పదవుల అప్పగింతపై శ్రేణుల గుర్రు
అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఇన్ని అనుమానాలు ఎందుకు..? పరివారం పెద్దది అయినప్పుడు ‘నయా’వారెందుకు..? కొత్త బలాన్ని తెచ్చుకోవడంలో తప్పులేదు గానీ, లేని బలాన్ని ఉన్నట్టుగా చూపాలనే ప్రయత్నం అత్యంత బలహీనం. స్వయంకృతంతోనే దట్టం పలుచనవుతుంది.., ఆత్మాభిమానం వంచనగా మారుతుంది. ఏది ఏమైనా బలాన్ని వెతుక్కుంటున్నామంటేనే బలహీనతేంటో గుర్తెరిగినట్టు. ఫలాలు అందడం లేదంటే పొరపాట్లేక్కడో పాతుకుని ఉన్నట్టు.. అయినా కచ్చితపు లెక్కలెప్పుడు మింగుడుపడవు.., నిజాలెప్పుడు రుచించవు. కళ్లముందు కనిపించేదంతా వాస్తవం అనుకుంటే, తప్పు చూపుదైనా అయ్యుండాలి.., దానిని సర్దిచెప్పుతూ చేస్తున్న ఆలోచనదైనా లోపముండాలి.
-స్పాట్ వాయిస్, వరంగల్
తూర్పున కొత్త గాలి వీస్తోంది. చేరికలు, వలసలతో నేతలంతా బిజీగా మారారు. పుంజుకుంటున్న భారతీయ జనతా పార్టీ, పలుచనవుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి., పాత బలాన్ని పోగేసుకుంటున్న కాంగ్రెస్., ప్రధాన పార్టీలన్నీ వాటివాటి మార్గాలను చక్కదిద్దుకుంటూ బలాన్ని పెంచుకునే పనిలో తలమునకలై ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే అందరి చూపు అధికార పార్టీ పైనే ఉంది. కానీ, ఆ మాటకొస్తే టీఆర్ఎస్ లో గ్రూపు విభేదాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అంతా ఒకే పార్టీలో ఉన్నారన్నే మాటేగానీ ఒకరితో ఒకరు ఎక్కడా కలిసినట్టుగా అనిపించదు.., పైకి కలిసినట్టుగా ఉంటారేమోగానీ అతి జరిగే పని కాదన్నట్టుగా కూడా నడుచుకుంటున్నారు.
కారు డోరు తీస్తే..
‘కారు’ చూడడానికి అంతా బాగానే ఉన్నట్టుగా, పైకి ఎంతో గంభీరంగా కూడా కనిపిస్తోంది. కానీ, డోర్ తెరిచి చూస్తే అసలు చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్య నేతలంతా అక్కడే పాతుకుని కాచుక్కూర్చున్నారు. అందరి దృష్టి ‘తూర్పు’ పీఠంపైనే. గతంలో కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించి తన మార్కుగా కూడా బాటలు వేసుకున్న గురుతులు ఇంకా పదిలమే. ఆ మాటకొస్తే ఆ దంపతులకు అక్కడ బలమున్న విషయాన్ని ఎవరూ కాదనలేని సుస్పష్టం. ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యం, వారు వేరే పార్టీలోకి వెళ్లిన సందర్భం అన్నీ తెలిసిందే.
ఎవరి ఆట వారిది..
ఇప్పుడు అందరూ సమఉజ్జీలు ఉంటే ఆట రసవత్తంగా ఉంటుందనడంలో ఏ మాత్రం నిజం లేదు. రసవత్తంగా మారే అవకాశం ఎవరూ ఎవరికీ ఇవ్వరు. కలిసి ఆడితేనే ఆట రసవత్తంగా ఉంటుంది తప్ప, ఎవరి ఆట వారు ఆడితే ఆటకున్న పసే పోతుంది. ఇప్పుడు అచ్చు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కనిపిస్తున్న పరిణామాలు ఏ మాత్రం దానికి తీసిపోనివి. అతిరథమహారథులంతా కలిసి శత్రువుతో ఆడడం మానేసి, ఎవరికి వారుగా వారిలో వారే విరోధులుగా మార్చుకుని ఆడుకుంటున్నారు. దీంతో స్వపక్షంలో విపక్షాలుగా మారి ఆడుతున్న వారి ఆటలో శ్రేణులు పావులవుతున్నాయి, ప్రజలు పథకాలకు దూరమవుతున్నారు.
విభజన రేఖ స్పష్టం..
తూర్పు నియోజకవర్గంలో విభజన రేఖ సుస్పష్టం. అటు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య.., మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు, ఇంకా ఆ మాటకొస్తే కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన గాయత్రీ రవి. ఇలా ఎవరికి వారుగా ప్రత్యేక గోడలను ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యే గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీలోని ఇద్దరు కీలక నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. గ్రేటర్ వరంగల్ కు అత్యంత కీలకంగా ఉన్న మేయర్ కు సరైన ప్రాధాన్యం దక్కకుండా, కార్పొరేటర్లు మేయర్ కు సహకరించకుండా మోకాలడ్డుతున్నట్టు ఎన్నో సందర్భాల్లో తేటతెల్లమైన విషయం తెలిసిందే. కలిసి సాగితేనే నగరాభివృద్ధి సాధ్యమనే నియమాన్ని మరిచి, వేరు కుంపట్లను పెంచిపోషించుకుంటున్నారు. ఎమ్మెల్యే పలువురు కార్పొరేటర్లను మేయర్ కు సహకరించకుండా నిలువరిస్తూ ఒంటరిని చేసేందుకు పావులు కదుపుతున్నాడనేది అధినేత స్థాయిలో కూడా తెలిసిన విషయమే. అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ప్రకారం నడుచుకున్నట్టుగా నటిస్తారే తప్ప ఆ మాటకొస్తే మేయర్ పాల్గొనే కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఉండరు.., ఎమ్మెల్యే వెళ్లాడంటే మేయర్ ఆ దిక్కుకు కూడా పోరు. ఇలా ఎవరి దారి వారుగా వెళ్తూ అంతా ఒకే పార్టీలో సాగుతున్నామనే కలరింగ్ ఇస్తూ పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి.
రెండు కత్తులు కష్టమే..
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా ఒకే నియోజకవర్గంలో ముగ్గురు, నలుగురు కీలక నేతలు పొసగడం అతి కష్టం. మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య తీరు మరో తీరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా సేవలందించిన బస్వరాజ్ సారయ్య కూడా తూర్పులోని కీలకనేతే. స్వతహాగా ప్రత్యేక బలాన్ని కలిగి వివాదరహితుడిగా కొనసాగుతున్న నాయకుడు ఆయన. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. మేయర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు ఇలా అతిరథులంతా అక్కడే తిష్ట వేసుకుని ఉంటే పార్టీ శ్రేణులు మాత్రం ఎవరి వెనకని పరుగెత్తుతారు.., ఎన్ని సార్లు తిరుగుతారు.
చేరికల వెనక మతలబు..
తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఎంతో బలమైన పార్టీ అనేది ఎవరూ కాదనని విషయం. పార్టీకి పెద్ద క్యాడర్ కూడా ఉంది. అయినా స్వరాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లు కావొస్తున్నా అందులో కొనసాగుతున్న వారికే ఇప్పటికీ ఎలాంటి ఫలాలు అందలేదు. పదవులూ దక్కలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల్లోని కీలకమైన వ్యక్తులను ఆహ్వానించి మరీ చేర్చుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పర్యటన నేపథ్యాన్ని పురస్కరించుకుని కమలం పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఇతర కీలక నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి కేటీఆర్ స్వయంగా వారికి ఆహ్వానం పలకడం, కారు పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని వారు కంకణం కట్టుకోవడం కూడా జరిగిపోయింది. నిజంగా వారంతా టీఆర్ఎస్ పార్టీకి తమవంతుగా సేవ చేస్తే అంతకన్నా హర్షించేది ఏమీ ఉండదని, కానీ వారంతా స్వార్థానికి, చేసుకోవాల్సిన పనుల కోసమే పార్టీ కండువా కప్పుకున్నారని నియోజకవర్గంలోని ఓ కీలక నేత అభిప్రాయపడ్డారు. అందునా ఎమ్మెల్యే తన బలాన్ని ప్రదర్శించుకోవడానికే అందరినీ ఆగమేఘాలపై పార్టీలో చేర్పించారని కూడా పేర్కొన్నారు.
నష్టమే ఎక్కువ..
ప్రస్తుతం తూర్పు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి పట్టుమంటే కప్పకు కోపం.., విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంది. పెద్దపెద్దోళ్లంతా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీని చక్కదిద్దాల్సింది పోయి స్వప్రయోజనాల కోసం పార్టీనే వాడుకుంటున్నారు. వారి వారి చర్యలతో పార్టీకి లాభం మాట దేవుడెరుగు తీవ్ర నష్టమే కలిగే పరిస్థితులు సమీప రోజుల్లోనే చూడాల్సి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ కీలక గులాబీ నేత తన ఆవేదనను వెలిబుచ్చారు. పెద్ద సార్ లేదంటే చిన్న సారో ఎవరో ఒకరు ఇప్పటికైనా నియోజకవర్గంలో పార్టీ నిర్మాణంపై ప్రత్యేక చొరవ తీసుకుంటేనే రాబోయే రోజుల్లో అనుకున్న లక్ష్యం చేరడం సులభం అవుతుందని ఆయన సూచించారు.
Recent Comments