Sunday, November 24, 2024
Homeజనరల్ న్యూస్తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమురయ్య

తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమురయ్య

నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ రాజ్య ప్రజలు సాగించిన మహత్తరమైన ప్రజా పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పొరాటం. భూమి, భుక్తి, విముక్తి అనే మౌలిక హక్కుల కోసం 1724 స్థాపించబడిన హైదరాబాద్ సామ్రాజ్యా్న్ని 1948లో తెలంగాణ ప్రజలంతా కలిసి కూకటి వేళ్లతో పెకిలించి తమ విముక్తిని ప్రకటించుకున్నారు. నిజాం ప్రభువుల పాలనకు మూల స్థంభాలుగా నిలిచిన భూస్వాములు, దేశముఖ్ లు, అవినీతి అధికారులు తెలంగాణ ప్రజలపై పాశవిక నిర్భందాన్ని ప్రయోగించారు. ఈ నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేయడానికి ఆనాటి కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభలు ఉమ్మడిగా ప్రజా ఉద్యమాన్ని నడిపించాయి. ఆ సమయంలోనే దేశముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రస్తుత జనగామ జిల్లాలోని కడవెండి గ్రామంలో ప్రజలు కొనసాగించిన వీరోచిత పోరాటం చారిత్రాత్మకమైనది.

అది 1946 జూలై నాలుగో తేదీ.. రాత్రి ఏడు గంటల సమయం దేశముక్ ల ఆగడాలు హద్దు మీరడంతో భరించలేని ప్రజలు ఊరేగింపు తీస్తున్నారు. బాంచెన్ కాల్మొక్త దొరా.. అని వెట్టి చాకిరీతో బానిసల్లా బతుకుతున్న రైతులు విసిగిపోయి బందూక్ లతో విసునూరు దేశ్ ముక్ జానమ్మ దొరసాని గడి వైపునకు కదం తొక్కుతూ కొనసాగారు. దొరసాని గూండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య మరణించగా చాలా మంది గాయపడ్డారు. ముఖ్యంగా ఈ తిరుగుబాటుకు కారణం వెట్టి గెర్రెలు ఇవ్వనని కరాఖండిగా చెప్పిన దొడ్డి మల్లయ్యను టార్గెట్ చేసిన దొరసాని పలు కేసులు బనాయించి నానా హింసలు పెట్టడం, దొరల ఆగడాల నుంచి నిరుపేద రైతాంగానికి రక్షణగా, వెన్నెముకలా నిలబడటానికి 1930 లో ప్రారంభించిన “సంఘం” ఇచ్చిన చైతన్యం చోదక శక్తులుగా పనిచేశాయి. ఇంటినే పోరాట కేంద్రంగా మలిచిన వీరనారి ఐలమ్మ పంట రక్షణలో సంఘం సాధించిన విజయం స్ఫూర్తి నిచ్చింది. విసునూరు రామ చంద్రారెడ్డి పాలకుర్తి గ్రామానికి చెందిన పంటను కోసుకోవడానికి, పొలాన్ని ఆక్రమించుకోవడానికి తన గూండాలతో నిరంతర దాడులు చేయించాడు. ఐలమ్మ పంట పొలాల రక్షణ కోసం పోరాట పద్ధతులలో, రాజకీయ చైతన్యంలోకి క్రియాశీలంగా ఉన్న దొడ్డి కొమురయ్య, దొడ్డి మల్లయ్య సోదరుల నాయకత్వంలో కడవెండి గ్రామ సంఘ వలంటీర్లు ఎర్రమరెడ్డి మోహన్ రెడ్డి, నల్లా నరసింహుడు, లింగయ్య, కొండయ్య తదితరులతో పాలకుర్తిలో మకాం వేసి సాయుధ కవాతులు జరుపుతూ రౌడీ మూకలను తరిమి కొట్టారు. ఐలమ్మ పంటను కోసి ఇంటికి తెచ్చారు. అంటే కాకుండా పేద మధ్య తరగతి రైతాంగం నుంచి బలవంత లెవీ ధాన్యం సేకరణ ఆపాలని, వేలాది ఎకరాలు ఉన్న దొరల నుంచి సేకరించాలని దొడ్డి కొమురయ్య, మల్లయ్య సోదరుల నాయకత్వంలో నానాటికీ పోరు తీవ్ర తరమవుతున్నది. ఈ వరుస సంఘటనలతో అహం దెబ్బతిన్న దేశముక్ రామచంద్రారెడ్డి “సంఘం” నాయకులపై కక్ష గట్టాడు. 1946 జూలై నాలుగో తేదీన తప్పతాగిన దేశముక్ గూండాలు సంఘ నాయకుల ఇళ్లపై రాళ్లు విసిరారు. దీనికి ప్రతిగా ప్రజలు లాటీలు, వడిసెలు చేతబూని “ఆంధ్ర మహాసభ వర్ధిల్లాలి, వెట్టి చాకిరి నశించాలి” వంటి నినాదాలు చేసుకుంటూ ఊరేగింపు జరిపారు. ఈ ఊరేగింపు దొరసాని గడిని సమీపించగానే దొర గుమస్తా మిస్కిన్ అలీ గూండాలు జరిపిన కాల్పుల్లో అగ్రగామిగా నడుస్తున్న దొడ్డి కొమురయ్య పొట్టలోకి తుపాకీ తూటా దూసుకుపోయింది. “ఆంధ్ర మహాసభకు జై” అంటూ అక్కడక్కడే ప్రాణం విడిచాడు. ఈ కాల్పుల్లో దొడ్డి మల్లయ్య రెండు కాళ్లలో తూటాలు దూసుకుపోయాయి. మంగలి కొండయ్య చేతికి తూటా తగిలింది. అయినా ప్రజలు భయకంపితులై పారిపోకుండా “రక్తానికి రక్తం” అని నినాదాలు చేసుకుంటూ దొరసాని గడిని చుట్టుముట్టారు.

ఇలా తెలంగాణ సాయుధ పోరాటం వీర మరణంతో ప్రారంభమైంది. కడవెండి గ్రామం ఉద్యమానికి అగ్గిరాల్చిన యజ్ఞ వేదికయ్యింది. కడవెండి వీరులైన నల్లా నర్సింహులు, నల్లా వజ్రమ్మ నాయకత్వంలో తొలి పురుష, మహిళా దళాలు ఏర్పడి తమ గెరిల్లా చర్యలతో జనగామ ప్రాంతాన్ని విముక్తం చేశాయి. ఇది దావానంలా
తెలంగాణ అంతటా వ్యాపించింది. శతాబ్దాలుగా నిద్రానంగా, జడత్వం ఆవరించిన ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసింది. 1946 జూలై 4 నుంచి తెలంగాణ సాయుధ పోరాటం 1951 అక్టోబర్ 21 వరకు కొనసాగింది. గడీలను కూల్చింది., దున్నేవానికి భూమి నినాదంతో ప్రజలకు పది లక్షల ఎకరాల భూమిని పంచింది., నిజాం దొరల నుంచి మూడు వేల గ్రామాలు విముక్తయ్యాయి., గ్రామ స్వరాజ్యాలు వెలిశాయి., వెట్టిచాకిరీ రద్దయింది., కుల వివక్ష బలహీనమైంది., మతసామరస్యం వెల్లివిరిసింది., నిజాం సైన్యం, రజాకార్ల తదితర పాలనా వ్యవస్థను గెరిల్లాలు చావుదెబ్బతీసారు., హైదరాబాద్ రాజ్యం భారత్ లో విలీనం కావడానికి దారి తీసింది. ఈ క్రమంలో నాలుగు వేలకు పైగా సాహసులు, ధీరోదాత్తులు అమరత్వం చెందారు. ఈ పోరాట స్ఫూర్తి ఆ తర్వాత జరిగిన గైర్ ముల్కి గో బ్యాక్, 1969 జై తెలంగాణ, నక్సల్ బరీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమాలు ఉత్తుంగ తరంగాల్లా ఎగిసిపడ్డాయి. స్వరాష్ట్ర స్వప్నం సాకారమైయింది..

సాహిత్య చరిత్రలో ఈ కాలం ప్రజా సాహిత్యానికి పట్టం కట్టింది. అమరులైన వీర తెలంగాణ పోరాట యోధుల గురించి, గెరిల్లా దాడులు, విముక్తి ప్రాంతాలపై కవులు కళాకారులు, నిరక్ష్యరాస్యులైన ప్రజలు సైతం పాటలు, గొల్ల సుద్దులు, బుర్ర కథలు చెప్పుకుని మైమరచిపోయారు. మరింత ఉద్యమ గుండెల్లో నింపుకున్నారు. కేఎల్ నరసింహరావు రాసిన “అమరజీవి కొమురయ్య.. అందుకో జోహార్లు కొమురయ్య, లంచ గొండుల అండ.. దేశముక్ ల అండ, న్యాయ రక్షణ కోసం నడుం బిగించితివి, గూండాల తుపాకీ గుండ్లకెదురుగా పోరి, బలియైన వీరుల్లో కొమురయ్య, మొదటి తెలుగోడివి కొమురయ్యా, మార్గదర్శిగా ఉండు కొమురయ్యా..” అనే పాట నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో మార్మోగింది. నాటి పోరాటానికి అండగా నిలబడిన
మీజాన్ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు
కొమురయ్య అమరత్వంపై “వెలిగింది వెలిగింది ఒక అమరజ్యోతి, తళతళ మిలమిల జిలుగులొలికించింది., తెలుగు గుండెలలోన వెలిగించి, దివిటీలు, రైతు గుండెల కోసం రాకాసుల నుదునుమ., వెలిగింది వెలిగింది ఒక అమరజ్యోతి” అనే స్మృతి కవితను రాశాడు. నాటి పోరులో ప్రజలపై జరుగుతున్న హక్కుల హననంపై నిరసన తెలిపి అంతర్జాతీయ మద్దతును కూడగట్టడంలో సరోజినీ నాయుడు కొడుకు జయసూర్య, కుమార్తె పద్మజానాయుడు క్రియాశీలంగా పనిచేశారు. వీరి సోదరుడు కవి హరీద్రనాథ్ చటోపాధ్యాయ రాసిన “టేల్స్ ఆఫ్ తెలంగాణ”లో కొమురయ్య లాంటి ఎందరో మట్టి మనుషుల గురించి “అమర జీవి దమనులలో విమల రక్తముడుకున్నట్లు, సమరశీలి నాసికలో వేడి శ్వాసలు ప్రసరించినట్లు, హేసాధారణ గ్రామ మూర్తి, ఇతిహాసపు పుటలలోన స్పందించుము, జ్వలించుము, ప్రసరించుము, వర్ధిల్లుము” అనే కవిత రాశాడు. సుద్దాల హన్మంతు, బండి యాదగిరి, కోటేశ్వరమ్మ, వజ్రమ్మ, లివింగ్ లెజెండ్ మల్లు స్వరాజ్యం వంటి ఎందరో సాంస్కృతిక యోధులుగా ప్రాచుర్యం పొందారు.

జయాపజయాలతో సంబంధం లేకుండా ఎడతెగని ప్రజల స్వేచ్ఛా కాంక్షతో కొనసాగిన ఉద్యమాలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఇతిహాసాలకన్నా మిన్నగా ఉన్న మహోజ్వల ఘట్టాలైన తెలంగాణ పోరాట చరిత్రను మన పాఠ్య పుస్తకాల్లో చేర్చుకున్నాము. మనకు జవం, జీవం, ఉనికికి, ఊపిరి పోసే భాషా సాంస్కృతులను పునరుద్దరించుకుంటున్నాము. పాలనతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుకున్నాము. తెలంగాణ ఉద్యమ క్రమంలో నాటి చరిత్రను సమకాలీన తరాలకు తెలియచేయడం కోసం దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వందలాది సదస్సులను నిర్వహించింది. తెలంగాణ జాక్ అనేక నిర్మాణాత్మక సూచనలను ఇచ్చింది. దొడ్డి కొమురయ్య వర్ధంతుల సభలు జాక్ చేత నిర్వహింపచేసింది. ఆనాటి అమర వీరుల కుటుంబ వారసులు, పౌర సమాజంనాటి సాయుధ పోరాట వీరులకు, ఆ చరిత్రకు మరింత సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నది. స్మారక చిహ్నాలను, చరిత్ర మ్యూజియంల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టాలని, జూలై 4 ను అమర వీరుల దినంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నది. ఈ చర్యలు ప్రజల హృదయాలను చలింపచేస్తూ, ప్రవహించే ఉత్తేజంలో నిలుస్తూ బహుళత్వం విలసిల్లి అభివృద్ధి ఫలాలు అందరికీ అందే నవ తెలంగాణ నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుంది

RELATED ARTICLES

Most Popular

Recent Comments