Sunday, November 24, 2024
Homeటాప్ స్టోరీస్ఎడ్డెమంటే తెడ్డెమే..?!

ఎడ్డెమంటే తెడ్డెమే..?!

నువ్వెంతంటే.. నువ్వెంతా..?
సాలు.. సంపకు.. సెలవు..
ఇంకా దిగజారుతున్న రాజకీయాలు..
కమలం, గులాబీ బాహాబాహీ..
ఫ్లెక్సీల్లోనే పరస్పర యుద్ధం..
వేదికలపై కరచాలనం.., వేరుపడితే కత్తి దువ్వడం
నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అన్నట్టుగా నేతల వ్యవహారం…

నువ్వొక్కటంటే నేను రెండంటా. నువ్వు రెండంటే నేను నాలుగంటా. నువ్వు లోపల్లోపల గులిగితే నేను గట్టిగా అరుస్తా. నువ్వు బిగ్గరగా అరిస్తే నేను ఏకంగా మీదపడి కరుస్తా. హన్నా.. ఇంత పనికొస్తవా.. అన్నీ చుట్టేయ్యాల్నని చూస్తే పెంటమీదియన్నీ అంటగడుతా. నీ పప్పులు మా దగ్గరుడకవు. సూసుకుందామంటే సూసుకుందాం. నువ్వు అక్కడ తోపుగావొచ్చు., ఇక్కడి నేనే తోపును. నీ ఆటలు ఈడ సాగయ్. నువ్వు ఎడ్డెమంటే నేను తెడ్డెమంటా. రాజకీయాలు మీకే కాదు.., మాకు వచ్చు. నోరు విప్పితే మీకన్నా దిగజారి మాట్లాడేంత ప్రతిభ ఉంది మాకు.. అనే రీతిలో ఇటు కమలం, అటు గులాబీ కదం తొక్కుతున్నాయి. ఫ్లెక్సీల రాతలతో రాష్ట్రంలో అప్రకటిత యుద్ధం చేస్తున్నాయి. ప్రజలు గమనిస్తున్నారనే సోయి గూడా మరిచి రెచ్చిపోతున్నారు.
-స్పాట్ వాయిస్, హైదరాబాద్

‘‘శ్మశానం ముందు ముగ్గుండదు.., రాజకీయ నాయకులకు సిగ్గుండదు..’’ అనేది లోకోక్తి. ప్రస్తుతం నడుస్తున్న పరిణామాలు అచ్చు అలాగే కనిపిస్తున్నాయి, అనిపిస్తున్నాయి కూడా. ఎంతో హుందాగా నడుచుకోవాల్సిన నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే పనిలో పీహెచ్ డీలు తీసుకుంటున్నారు. చేయాల్సిన కార్యాలను పక్కనబెట్టి, కారాలు మీరాలు నూరుకుంటున్నారు. ఎదురుపడితే అంతా ఒకేగానీ, వేదికలెక్కితే మాత్రం సవాళ్లు విసురుకుంటూ శపథాలు చేస్తున్నారు. ‘సాలు’ సాల్లేవయ్యా.. పెద్ద చెప్పొచ్చావ్ గానీ. ఎందుకు ‘సంపు’తున్నావ్. నీ గురించి ఎవడికి తెల్వదు. నీదే సక్కగా లేదుగానీ, మాకు నీతులు చెప్పవడ్తివి. ముందు మీది చూసుకోండి.., తర్వాత ఏమన్నుంటే మాకు చెప్తురుగానీ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు.

అన్నీ గుత్త తీసుకుండ్రు..
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సభలు, సమావేశాలతో టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ చూస్తోంది. మేము కూడా తక్కువ కాదంటూ అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. కార్యవర్గ సమావేశాల సందర్భంగా నగరాన్ని కాషాయమయం చేయాలనుకున్న కమలనాథుల జోష్‌కు టీఆర్ఎస్ అడ్డుకట్ట వేసింది. నగరంలోని హోర్డింగ్స్, మెట్రో ఫిల్లర్స్ అన్నింటిని అధికార పార్టీ ముందే ఆధీనంలోకి తీసుకుంది. పరేడ్ గ్రౌండ్‌లోకి వీఐపీలు వెళ్లే గేట్ వద్ద, బస్సు షెల్టర్లకు టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వెళ్లే ప్రధాన గేటు వద్ద సైతం టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రచారం కోసం యాడ్ ఏజెన్సీలను సంప్రదించిన బీజేపీ షాకైంది. ఇప్పటికే టీఆర్ఎస్ బుక్ చేసుకుందంటూ యాడ్ ఏజెన్సీల నుంచి సమాధానం వచ్చింది. దీంతో పబ్లిసిటీ ఎలా చేయాలన్న దానిపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. మెట్రో ఎల్ అండ్ టీకి కేంద్ర పెద్దలతో చెప్పించే ప్రయత్నాల్లో కమలనాథులున్నారు. మెట్రో రైళ్లు, పేపర్ ఏజెన్సీలను సంప్రదించిన బీజేపీకి ఇదే సమాధానం వచ్చింది. ఆర్టీసీ బస్ షెల్టర్లపై టీఆర్ఎస్ ఎమిదేళ్ల పాలన ఫ్లెక్సీలు వెలిశాయి.


సాలు దొర.. సెలవు దొర..
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలియజెప్పేలా బీజేపీ నేతలు ఓ స్లోగన్ విసిరారు. రెండు రోజుల కిందట ‘సాలు దొర.. సెలవు దొర..’ అనే పేరుతో వ్యంగ్యంగా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎనిమిదేళ్ల పాలనలో మీరు చేసింది ఇక సాలు.., మీరు ఇంటికి వెళ్లిపోతే ఇక మంచిది అనే రీతిలో సాగిన వారి రాతలు పెద్ద రాజకీయ ప్రకంపనమే పుట్టించింది. ప్రజల్లోకి ఓ వైరల్ మాదిరిగా వెళ్లిన ఈ పదాలు టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడలేదు. జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి మంత్రి కేటీఆర్ సహా గులాబీ నేతలంతా మీడియా ముందు విపరీతంగా మాట్లాడారు. సంస్కారం మరచి నడుచుకుంటున్న బీజేపీ నేతలంటూ దుమ్మెత్తిపోశారు. తాము స్థాయి దిగజారి మాట్లాడలేము అని దుయ్యబట్టారు. వెంటనే ఆ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు.

సాలు మోదీ.., సంపకు మోదీ..
బీజేపీ నేతలు చేపట్టిన సాలు దొర.. సెలవు దొర.. అనే కార్యక్రమానికి విరుగుడా అన్నట్టుగా రాష్ట్రంలోని గులాబీ నేతలు సాలు మోదీ..సంపకు మోదీ అనే రాతలతో రాష్ట్రంలో ఆగమాగం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ప్రధాని సహా అంతా ముఖ్య నేతలంతా రాష్ట్ర రాజధానికి వస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని నగరం మొత్తంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఎక్కడికక్కడ బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడుతూ ప్రజలే ఆలోచించాలి అనే అర్థం వచ్చేలా రాతలతో విరుచుకుపడ్డారు. దీంతో ఇటు కేంద్రంలోని బీజేపీ, అటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికలకు ముందే ఒకరిపై ఒకరు చిందులేస్తున్నారు. విలువలన్నీ వదిలి దిగజారుడు మాటలతో ప్రజలకు మంచి ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments