వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్..
సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం..
మొన్న మల్హర్‌లో టైగర్ అంటూ వీడియో..
నేడు పులి ఆవుపై దాడి, పలువురికి గాయాలంటూ ఫొటోలు
ఉరుకులు పరుగులు పెడుతున్న అటవీశాఖ అధికారులు
వణికిపోతున్న భూపాలపల్లిని మరింత భయపెడుతున్న ఫేక్ గాళ్లు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: అసలే పులి సంచరిస్తోందనే వార్త జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలను భయపెడుతోంది. వీరి భయానికి ఫేక్ గాళ్లు తోడై… ఇదిగో పులి అంటే.. అదిగో తోక అన్నట్లుగా వార్తలను వైరల్ చేస్తున్నారు. వారం రోజుల క్రితం జిల్లాకు పులి వచ్చిదంటూ ఆర్టీసీ డ్రైవర్ చెప్పగా.. అటవీ శాఖ అధికారులు పరిశీలించి అడుగుజాడలను కనిపెట్టారు. పులి వచ్చిన మాట నిజమే అని తేల్చారు. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. డ్రైవర్ కు కనబడినప్పటి నుంచి నేటి వరకూ పులి ఎవరికీ కనిపించలేదు. ట్రాపింగ్ కెమెరాలకూ చిక్కలేదు. భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ సమీపంలో సంచరిస్తోందంటూ మొదట వదంతులు వచ్చాయి. ఆ తర్వాత రెండు రోజులకు మల్హర్ మండలంలో పులి ఉందంటూ వీడియోలు వచ్చాయి. మల్హర్ మండలం నాచారం గ్రామ సమీపంలోని మల్లన్న గుట్ట దగ్గర కాసరపు వాగులో సంచరించిన ఆనవాళ్లు మంగళవారం లభించాయి. ఇక బుధవారం రోడ్డుపైకి పులి వచ్చిందంటూ మళ్లీ వార్తలు గుప్పుమనగా.. భూపాలపల్లి జిల్లా వాసులు వణికిపోతున్నారు.
ఫేక్..ఫేక్..
రుద్రారం కొయ్యూరు ప్రధాన రహదారి పై బ్రిడ్జి మీద సోమవారం ఉదయం పులి సంచరించిందంటూ సోషల్ మీడియాలో ఫేక్ వీడియోను వైరల్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ అధికారులు తేల్చారు. ఉదయం నుంచి వీడియో వైరల్ కావడంతో కొయ్యూరు రేంజ్ అటవీ అధికారులు రుద్రారం, ఎడ్లపల్లి, కొయ్యూరు, శాత్రాజ్ పల్లి రహదారులపై ఉన్న బ్రిడ్జిలను పరిశీలించారు. వీడియోలో ఉన్న బ్రిడ్జికి వాస్తవ బ్రిడ్జిలకు ఏమాత్రం సంబంధం లేదని తేల్చారు. ఇక బుధవారం మధ్యాహ్నం నుంచి మరో ఫేక్ ఫొటోలు, వార్త వాట్సప్, ఫేస్ బుక్ లో హల్ చల్ చేసింది. భూపాలపల్లి మండలం కమలాపురం( బొగ్గువాగు) బిడ్జి వద్ద పులి రోడ్డు దాటిందని, దాని చూసిన వాహనదారులు భయపడి ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందడంతోపాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయంటూ ఓ వార్త గుప్పుమంది. దీంతో భూపాలపల్లి పట్టణ వాసులు వణికిపోయారు. అటువైపుగా వెళ్లే వారంతా.. ప్రయాణాలు మానుకున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోలు శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడిలో గాయపడిన వారి ఫొటోలను ఇక్కడివేనంటూ ఫేక్ గాళ్లు ప్రచారం చేస్తున్నారు.
ఉరుకులు పరుగులు
అదిగో పులి అంటూ ఫేక్ గాళ్లు సోషల్ మీడియాలో చేసే హడావుడికి ఫారెస్ట్ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఫేక్ గాళ్ల దాటికి వార్తలు నిమిషాల్లోనే వైరల్ అవుతుండడంతో.. అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఘటన స్థలానికి వెళ్లడం.. పులి సమాచారం కోసం వెతకడం ఇబ్బందిగా మారుతోంది.
భయపడుతున్న జనాలు
నిజాలు నాలుగు అడుగులు వేసేలోపే.. అబద్ధం ప్రపంచాన్ని చుట్టివేస్తుందన్నట్లుగా.. ఫేక్ గాళ్లు చేసే ప్రచారం.. నిమిషాల్లోనే వైరల్ అవుతోంది. దీంతో జనం భయపడిపోతున్నారు. అసలే పులి.. మళ్లీ అది దాడి చేసిందని, ఇక్కడ.. అక్కడ ఉందంటూ గాసిప్స్ రావడంతో జనం వణికిపోతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ జోరుగా నడుస్తోంది. ఈ సమయంలో రైతులు ఎక్కువ పొలాల్లోనే ఉంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో జరుగుతున్న అబద్ధపు ప్రచారానికి వారంతా ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఫేక్ గాళ్లు ఇలాంటివి సృష్టించకుండా ఉంటే బాగుటుందని ప్రజలు కోరుతున్నారు.
ఫేక్ ప్రచారం చేయొద్దు..
డీఎఫ్ఓ భూక్య లావణ్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
పులి వచ్చిందనే భయంలో జిల్లా ప్రజలు ఉన్నారు. ఆ భయాన్ని అబద్ధపు వీడియోలు, ఫొటోలతో మరింత రెట్టింపు చేయొద్దు. రెండు రోజుల క్రితం మల్హర్‌లో పులి అంటూ వీడియో వైరల్ చేశారు. ఈరోజు బొగ్గుల వాగు బ్రిడ్జి వద్ద పులి దాడి అంటూ శ్రీకాకుళం ఫొటోలు పెట్టి పోస్టు చేస్తున్నారు. ఇలా చేయొద్దు. జనాలు మరింత బయపడిపోతారు. పానిక్ టైంలో ఇలాంటి చేయడం సరికాదు. ఎవరైనా టైగర్‌ను చూస్తే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వండి. తాము నిజనిజాలు తెలుసుకొని వివరాలు అందిస్తాం. ఫేక్ వీడియోలతో ఇటు ప్రజలకు అటు పులికి సైతం ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ప్రజలు సైతం ఫేక్ వీడియోలను నమ్మకండి.
Recent Comments