Monday, November 11, 2024
Homeటాప్ స్టోరీస్గులాబీ బాస్ కు కన్ఫ్యూజన్..

గులాబీ బాస్ కు కన్ఫ్యూజన్..

కన్ఫ్యూజన్..

ముందు ముళ్ల బాట.., వెనకాల పెద్ద గొయ్యి.. అలా అని ఆగి ఉండే తరుణం అస్సలే లేదు. నడక సాగించాల్సిన గత్యంతరం. జాగ్రత్తగా అడుగులు వేయకపోతే ముళ్లు గుచ్చుకుంటాయి., వెనక్కి తిరిగి వెళ్దామంటే గోతిలో పడాల్సిన దుస్థితి. నడక సాగినన్ని రోజులు అంతా బాగానే ఉంది. అవాంతరాలు మొదలయ్యాయంటే ఆలోచనలో పడాల్సిందే. అచ్చు అలాగే ఉంది రాష్ట్రంలోని సర్కార్ ను నడుపుతున్న టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఏదో దీర్ఘాలోచన.. మరేదో సంశయం. ముందు వెనకాల సందిగ్దంలో నడి సంద్రంలో కొట్టుమిట్టాడే కలవరం.
===============================

మాటల మాంత్రికుడు.. పట్టు సాధింపే తప్ప విడుపంటే తెలియని విక్రమార్కుడు కేసీఆర్ బీఆర్ఎస్ పై పునరాలోచనలో పడ్డారు. ప్రాంతీయాన్ని జాతీయంగా మలిచే పనిలో నిమగ్నవమవడం అంటే అంత ఆశామాషి కాదు. రెండు దశాబ్దాలుగా అలవాటు పడిన అభిమానులను మలచడం కత్తిమీద సామే. దేశాన్ని ఏలే నేతలైనా సరే ప్రాంతీయంగా పట్టు కోల్పేతే అసలుకే మోసం తప్పదనే ఆందోళన గురించిన విషయం తెలిసిపోయి ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతాం.. ఇదిగో.. అదిగో.. అన్నట్లు ఉరిమిన ఆయన ఇప్పుడు స్తబ్దుగా మారారు. అదే సమయంలో పెద్దాయనకు మద్దతుగా దేశ్ కీ నేత అని గతమెత్తిన గులాబీ సైనం ఇప్పుడు నోళ్లు తెరవడం లేదు. పరిస్థితులు తారుమారు అయ్యాయా., ఇప్పుడు కట్టు తప్పుకోవడం ఎందకా. .. మీమాంసలో పడ్డారంతా. గతంలో మాదిరిగా కొద్ది రోజులు కేంద్రంపై యుద్ధం చేసి.. మళ్లీ సరెండర్ అవుతారా..? అనే డైలామాలో కూడా పడ్డారంతా. జరుగుతున్న పరిణామాలు.., ఎదురవుతున్న అనుభవాలన్నీ చూస్తే నిశ్శబ్దం ఆవహిస్తోందని తెలుస్తోంది. పైగా మహారాష్ట్ర రాజకీయాలు కూడా జాతీయ పార్టీ ప్రకటన ఆలస్యానికి కారణమై ఉండొచ్చనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కేంద్రంతో కొరవి..
ఎంతైనా పెద్దోళ్లు పెద్దోళ్లే.., చిన్నోళ్లు చిన్నోళ్లే. ఎవరి బలం వారిది. గణతంత్ర రాజ్యంలో కేంద్రం సుప్రీం., రాష్ర్టం సబ్ ఆర్డినేట్ మాదిరి. పైగా ఇక్కడ టీఆర్ఎస్ కు ఎంత బలముందో.., కేంద్రంలో బీజేపీ కూడా అంతే బలంగా సరిపడ స్థానాలతో ఏకైక ప్రధాన పార్టీగానే సర్కార్ నడిపిస్తోంది. అలాంటప్పుడు ఎవరు తగ్గడం లేదు. దీంతో కొందరైతే టీఆర్ఎస్ కావాలనే కేంద్రంతో కొరవి పెట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్లు కాళ్లు దువ్విన నుంచి వాళ్లు ఇరకాటంలో పెట్టేందుకు పావులు కదపడంలో ఆలస్యం చేయడం లేదని జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలిసిపోతుంది. మరో మాట కేంద్రం అధికారులు కేంద్రానివే, రాష్ట్రానికి రాష్ట్రానివే కావచ్చు కానీ, ఏ పనైనా చేయాలంటే ద్రవ్యం తప్పని సరి. దానిని ఆ పెద్దలు అడ్వంటేజ్ గా తీసుకుని కోత మొదలు పెట్టారు. గులాబీ గుబాళింపును నిలవరిస్తూ, అదే సమయంలో కమలం వికాసానికి ఉపయోగించుకునే పావులు కదపడంలో ఆలస్యం చేయడం లేదు. అయినా ఢీకొట్టేందుకు సీఎం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా తనబోటి వారినంతా ఒక్కటి చేసుందుకు కాలికి బలపం కట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. కానీ, అంతగా ఆశించిన్న శక్తి మాత్రం ప్రోదిచేయలేపోతున్నాడనేది అంగీకరించాల్సిన విషయంగా తేలిపోతున్నది. పైగా, పక్క రాష్ట్రం కూడా కేంద్రంతో లొల్లి ఎందుకని చేతులు కలిపేసిన ఘటనను మరవొద్దు. తనకు కావాల్సింది రాబట్టుకోవడానికి పంచన చేరి పనులు కానిచ్చుకుంటున్నాడు. అంతేకాదు తాజాగా రాష్ర్టపతి అభ్యర్థికి సైతం జగన్ జై కొట్టిన విషయాన్ని మరిచిపోవద్దు.

ఎటు తేల్చుకోలేక..
కొత్త జాతీయ పార్టీని రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే ఏర్పాటు చేయాలనే యోచనలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ పడినట్లు తెలుస్తోంది. ఈ జూన్ లోనే పార్టీ ప్రారంభించాలని హడావుడి చేసినా.. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఇది అనుకూల సమయం కాదనే వెనక్కి తగ్గారు. ఎవరికి మద్దతు తెలుపాలో తేల్చుకోలేక సైలెంట్ అయిపోయారు. ప్రతిపక్షాలు, అధికార పక్షానికి సమదూరం పాటిస్తున్నారు. బీఆర్ఎస్ ఎవరికి తొత్తుగా ఉండదనే సంకేతం తీసుకెళ్లాలనే చూస్తున్నా… రాష్ర్టపతి ఎన్నికల్లో ఆయన ఎత్తుగడ బయటపడనుంది.

టీఆర్ఎస్సా.. బీఆర్ఎస్సా..
టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ కోసం అన్నట్లుగా ఉన్న పార్టీని ఇప్పుడు బీఆర్ఎస్ చేయడం వల్ల పరిణామాలు ఎలా ఉంటాయనే ఆలోచనలో కేసీఆర్ పడ్డారు. ప్రజల్లోకి బలంగా వెళ్లిన టీఆర్ఎస్‌ను.. ఇప్పుడు బీఆర్ఎస్ గా పరిచయం చేస్తే వచ్చే ఎన్నికల్లో నెగ్గేనే అనే సంశయం బైలెల్లింది. ఈనేపథ్యంలో జాతీయ పార్టీ ప్రకటనపై వెనకడుగు వేస్తున్నారు. టీఆర్ఎస్సా.. బీఆర్ఎస్సా.. అనేది కేసీఆర్‌ తేల్చుకోలేకపోతున్నట్లుగా అనిపిస్తోందని.. అందుకే ఇంతటి తాత్సారం జరుగుతోందని వివరిస్తున్నారు విశ్లేషకులు.

అందుకేనా..?
సెంటిమెంట్ వికటిస్తే చక్కదిద్దడం ఎవరి తరం కాదు. నమ్మకం కోల్పోతున్నట్టు వాసన మొదలైతే నటిస్తూ మెదులుతూ నమ్మకం ద్రోహం చేస్తారు తప్ప అట్టిపెట్టుకుని ఉండడానికి ఎవరూ ఇష్టపడరు. పీకే ఎంత చక్కదిద్దుతాడో ఆ పెద్దాయనే తెలియాలి గానీ పార్టీకి తెలియకుండానే చేయాల్సిన నష్టాన్ని చేస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఇంకా ఎంతో దూరంలో ఉన్న ఎన్నికల వేడిని ఇప్పుడే రాజేసి కారు స్పీడ్ ను నియంత్రించడంలో తన పాత్రను చురుగ్గా పోషిస్తున్నాడు. నువ్వు పనికి రావాటా.. అని బహిరంగంగానే పేర్కొంటే ఎంతటి అసమర్థుడైనా తట్టుకోలేడు కదా. చక్కదిద్దుకోవాల్సింది పోయి సాగనంపుతారనే సిగ్నల్స్ ఇస్తే ఎవరు మాత్రం ముందే సదురుకోరు. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేల టెన్షన్ కూడా అధిష్టానానికి పట్టుకుంది. పక్క చూపులు చూసుకుంటూ దారులు వెతుక్కుంటున్నారనే సిగ్నల్స్ కూడా తాజా డెడ్ లైన్ పై ఉన్న వారు కూడా చేస్తున్నారు. ప్రజల్లో కూడా అసంతృప్తి పెరిగింది. పలు పథకాలు మంచి చేయడం ఏమోగానీ, ముంచే పరిస్థితి దాపురించింది. మరీ ముఖ్యంగా దళితబంధు పార్టీకి ఎంతో ప్లస్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు అదే కొంపముంచేలా మారింది. కేవలం గులాబీ శ్రేణులే దళితులా.. సామాన్య దళితులకు ఒక్కరూ పథకం ఫలాలు అందవా అని ఆ వర్గం నుంచే వ్యతిరేకత పెరుగుతోంది. మరో వైపు అటు కేంద్రంలోని కమలం పెద్దలతో పలువురు టచ్ లో ఉంటుండడం, ఇప్పుడే దస్తీ వేసుకుంటే రేపొద్దున్న ఏం జరిగినా ఓ ప్రత్యమ్నాయం ఉంటుందిలే అనే ముందు చూపుతో కారు కాస్త డీలా పడ్డట్టుగానే అనిపిస్తోంది. ఇన్ని గందరగోళాల నడుమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చేయాలనే ఫుల్ కన్ఫ్యూజన్ లోనే జాతీయ పార్టీని కాస్త పక్కన పెట్టి.., జరగాల్సిన కార్యాన్ని జరిపిస్తే బాగుంటుందేమో అని ధోరణిలో సాగుతున్నట్టు అనిపిస్తోంది.కన్ఫ్యూజన్..

  ……చేలిక రాజేంద్ర ప్రసాద్ – ఎడిటర్

RELATED ARTICLES

Most Popular

Recent Comments