భారీగా పెరిగిన కొవిడ్ కేసులు
విస్తరిస్తున్న ఎక్స్‌బీబీ1.16 వేరియంట్
స్పాట్ వాయిస్, బ్యూరో: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్నామొన్నటి వరకు 5, 6, 7 వేలలోపు కేసులు నమోదు అవుతూ వచ్చింది. బుధవారం ఒక్క రోజే 10 వేల పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లోనే 10,158 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 45 వేలకు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎనిమిది నెలల్లో ఈ స్థాయిలో కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి. ఎక్స్‌బీబీ1.16 అనే వేరియంట్ కారణంగా భారత్‌లో కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆసుపత్రుల్లో చేరికలు మాత్రం తక్కువగానే ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో 10 నుంచి 12 రోజుల్లో కొత్త కేసులు సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కేసుల తగ్గుముఖం పడుతుంది అనేది వైద్య రంగం అంటోంది. అంటే ఏప్రిల్ నెలంతా కరోనా భారీగా ఉండొచ్చని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Recent Comments