ఇద్దరి లక్ష్యం ఒక్కటే..
రాహుల్ జీ, రావ్ జీ దొందూదొందే..
వారసత్వం నిలుపుకోవడానికే వారి తపన
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి
కాంగ్రెస్, టీఆర్ఎస్ పై ధ్వజం..
స్పాట్ వాయిస్, హన్మకొండ : నిన్న జాతీయ వారసుడు రాహుల్ జీ, ఇవ్వాళ రాష్ట్ర వారసుడు రామారావ్ జీ ఇద్దరి లక్ష్యం వారసత్వాన్ని కొనసాగించడమే తప్ప ప్రజలపై చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. దేశంలోనే ఓరుగల్లు మంచి పర్యాటక క్షేత్రంతో పాటు తిరుగుబాటుకు కూడా బ్రాండింగ్ అని, అందుకే పొలిటికల్ టూరిస్ట్ లకు భయం పట్టుకొని వరుసపెట్టి వస్తున్నారని ఎద్దేవా చేశారు. నిన్న రాహుల్ గాంధీ, నేడు కేటీ రామారావు పర్యటన పర్యావసనంగా రాకేష్ రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాహుల్ తల్లిని, కేటీఆర్ అయ్యను మించిపోయారని, అక్కడ నువ్వు ఇక్కడ నేను అని వారసులిద్దరు కూడపలుక్కొని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ కు వరంగల్ అంటే భయం పట్టుకుందని, అందుకే కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడన్నారు. టెక్స్ టైల్ పార్క్ శంకుస్థాపన చేసి 6 ఏళ్లు గడుస్తున్నా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్టు అసలు వదిలేసి కొసరు పనులను ప్రారభిస్తున్నారంటేనే వాళ్లు ఏపాటి పనిమంతులో తెలుస్తోందన్నారు.
ఊదుకాలదు.. పీరు లేవదు..
కేటీఆర్ ఉపన్యాసాలు దంచడం తప్ప ఉద్దరించేది ఏమీ లేదని, అతడి భాషలోనే చెప్పాలంటే ఊదు కాలదు పీరు లేవదన్నారు. అబద్ధాలు ఆడటంలో, హామీలు గుప్పించడంలో అయ్యను మించిన కొడుకు కేటీఆర్ అన్నారు. టెక్స్ టైల్ పార్క్ వస్తే బతుకు బాగుపడుతుందని భూములిచ్చిన రైతులు కళ్లల్లో ఒత్తులేసుకొని చూస్తుంటే వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు భూసేకరణలో అడుగడుగునా అక్రమాలు చేసి, రైతుల దగ్గర అగ్వసగ్వా భూములు అమ్మించి ఇప్పుడు రెట్లు పెంచి గులాబీ నేతలంతా కోట్లకు పడగెత్తారని దుయ్యబట్టారు.
గ్రాఫిక్స్ సినిమా..
ఎంఎస్ఎంఈ ద్వారా మడికొండ దగ్గర కేంద్ర ప్రభుత్వం నిర్మించిన పవర్ లూమ్స్ షెడ్లను తమ ఘన కార్యంగా టీఆర్ఎస్ పబ్లిసిటీ చేసుకుంటోందన్నారు. ఐటీ హబ్ అంటే నాలుగు పిట్టగూల్లు కట్టి తూతూ మంత్రంగా వందమందికి ఉద్యోగాలు ఇచ్చి గ్రాఫిక్స్ లో సినిమా చూపిస్తే సరిపోదన్నారు. వచ్చే ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ వచ్చే జనరేషన్ మీద లేదన్నారు. ఓరుగల్లులో ఏటా 20 వేల మంది యువత గ్రాడ్యుయేట్లు అవుతుంటే వాళ్లకు సరైన అవకాశాలు కల్పించే వ్యవస్థ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న నేషనల్ పప్పు వచ్చాడు , నీనెందుకు పోవద్దని అట్టుకు జుట్టుపీక్కున్నట్టు వచ్చి అడ్డంపొడుగు అయ్య గురించి ఒర్రి పోవడం తప్ప కేటీఆర్ వరంగల్ కు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు.
కొంచెమన్నా సిగ్గుండాలి..
విస్తరిస్తున్న నగరానికి ఇంకా 50 ఏళ్ల నాటి మాస్టర్ ప్లాన్ నే వాడడానికి కొంచెమన్నా సిగ్గుండాలన్నారు. గతంలోనే బీజేపీ సంధించిన 30 ప్రశ్నల్లో కనీసం పదింటికి కూడా సమాధానం చెప్పలేదన్నారు. ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టేదే వాటాల పంపకానికని, అందరూ బసవన్నలు తప్ప మాట్లాడే వారెవరూ లేరన్నారు. ఇక మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నామమాత్రపు మినిష్టర్ అన్నారు. కేటీఆర్ లాగే ఎర్రబెల్లి కూడా మంత్రి కదా మరి ఆయనకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. అంటే కేవలం సీఎం కొడుకు అనే ఒకే ఒక క్వాలిఫికేషన్ తో రాచరిక పాలన సాగుతోందన్నారు.
బీజేపీ ఎదుగదలను చూసి ఓర్వలేక గింజుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇరు పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాబోయేది ముమ్మాటికి కమలం పార్టీదే అని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు.
Recent Comments