25 రోజులు దాటినా బాలిక అచూకీ దొరకని వైనం
మానవ హక్కుల కమిషన్ కు బాధితుల ఫిర్యాదు
బావపైనే పలు అనుమానాలు..?
స్పాట్ వాయిస్, కాజీపేట : పదో తరగతి చదువుతున్న బాలిక పాఠశాలకు వెళ్లి ఇంటికి రాక నెల రోజులు కావస్తున్నప్పటికీ కాజీపేట పోలీసులు పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కాజీపేట పట్టణ శివారులో నివాసం ఉండే రైల్వే ఉద్యోగి కూతురు బాపూజీ నగర్ లో పదో తరగతి చదువుతోంది. జూలై 6వ తేదీన పాఠశాలకు వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధు మిత్రుల ఇళ్లలో ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే తల్లిదండ్రులు కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి 25 రోజులు దాటినా అదృశ్యం కేసు ఓ కొలిక్కి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదనతో పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారే తప్ప వారి నుంచి సరైన సమాధానం దొరకడం లేదు. అమ్మాయి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, తమ బిడ్డను క్షేమంగా తమకు అప్పగించాలంటూ కనిపించిన వాళ్లందరినీ వేడుకుంటున్నారు. అయితే ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన రోజే పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలు అన్నింటిని పరిశీలించినప్పటికీ ఎక్కడా జాడ కనిపించలేదు. భువనగిరి సమీపంలో ఉన్న టోల్ గేట్ వద్ద సీసీ కెమెరాలు చూడగా అమ్మాయి ఓ ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసినట్లుగా గుర్తించారు. జనగామలో నివాసం ఉంటూ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న బాలిక సొంత అక్క భర్త మధు వాహనంపై వెళ్తూ కనిపించిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాలికను అపహరించడానికి ముందే మధు ఇద్దరి సెల్ ఫోన్లను అత్తగారింటికి పంపించి పోలీసులకు దొరక్కుండా తెలివిగా తప్పించుకుని తిరుగుతున్నాడని అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు లోనవుతున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కూతురును కాపాడాలని కోరుతూ, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయమై కాజీపేట సీఐ గట్ల మహేందర్ రెడ్డిని వివరణ కోరగా మిస్సింగ్ కేసు విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదని, నిందితుడిని చిన్న క్లూ కూడా దొరక్కుండా జాగ్రత్తగా పడడం వల్లే ఆలస్యం అవుతుందన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు జరుగుతున్నాయని, త్వరలో విషయం ఒక కొలిక్కి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
Recent Comments