సేఫ్ అంటున్న మావోయిస్టులు
బీజాపూర్ ఎన్ కౌంటర్‌పై లేఖ విడుదల
బాంబుల వర్షాన్ని ఖండించాలని పిలుపు
స్పాట్ వాయిస్, క్రైం: భద్రాచలం సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన కాల్పులపై గురువారం మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరు మీద విడుదలైన లేఖలో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్ కౌంటర్ కాలేదని స్పష్టం చేశారు. హిడ్మా చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, హిడ్మా సురక్షితంగా ఉన్నాడని తెలిపారు. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలోని కొండలపై పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు వైమానిక దాడులు చేశారని.. గతేడాది ఏప్రిల్‌లోనూ బాంబు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ నాయకత్వం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని దెబ్బ తీయాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారని తెలిపిన మావోయిస్టులు.. రాత్రీపగలు తేడా లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టినట్లు ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన మేరకే దాడులకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. కేంద్రంలోని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌లోని ప్రజావ్యతిరేక, గిరిజన వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకత్వంలో పోలీసు ఉన్నతాధికారులు, పరిపాలన అధికారులు నెట్టుకొస్తున్నారన్నారు. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పంట పొలాలకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దేశంలోని పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య కూటములు ఏకం కావాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
Recent Comments