అంబేద్కర్ ఆశయ సాధన దిశగా సీఎం కేసీఆర్ కృషి
అంబేద్కర్ జంక్షన్ సుందరీకరణ, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు
మే 31లోపు ప్రతి మండలంలో 2 గ్రంథాలయ గదులు ఏర్పాటు
అదనపు కలెక్టర్ దివాకర
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్: ప్రపంచ మేధావిగా భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు తెచ్చుకున్నారని అదనపు కలెక్టర్ దివాకర్ తెలిపారు. శుక్రవారం అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని జిల్లాలో అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభాప్రాంగణం వద్ద అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశానికి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారని, ప్రపంచం గర్వించదగ్గిన గొప్ప మేధావి అంబేద్కర్ అని, ఆయన చూపిన మార్గంలో నడిచి, దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అంబేద్కర్ చిన్నతనం నుంచి అనేక వివక్షను, అవమానాలను ఎదుర్కొని పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి దేశానికి మార్గదర్శకం చేశారని తెలిపారు. అంబేద్కర్ ఏ వర్గానికి చెందిన వారు కాదని, ప్రతీ వర్గంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించారని పేర్కొన్నారు. స్వాతంత్స్య సమయంలోనే సమాజంలో ఉన్న అసమానతలు తగ్గించేందుకు ఆయన కృషి చేశారని తెలిపారు.
అంబేద్కర్ 1920 కాలంలో 64 అంశాల్లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని, 2004 అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే టాప్ 100 మేధావుల జాబితా రూపొందిస్తే అందులో అంబేద్కర్ ప్రథమ స్థానంలో ఉన్నారని తెలిపారు. అంబేద్కర్ తన వ్యక్తిగత గ్రంథాలయంలో దాదాపు 50 వేల పుస్తకాలు ఏర్పాటు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యనభ్యసించడం వల్ల మన జీవితాలు స్పష్టమైన మార్పు తప్పనిసరిగా వస్తుందనడానికి అంబేద్కర్ వంటి మహనీయులు ఆదర్శమని తెలిపారు.
సమాజంలో అసమానతలు తొలగించేందుకు విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా రూపుదిద్దేందుకు మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు.
దేశ స్వాతంత్ర ఉద్యమంలో, రాజకీయ రంగంలో, సామాజిక వేత్త , విద్యావేత్తగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. స్త్రీల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషి ప్రశంసనీయమని, పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. భారతదేశంలో కార్మికుల సంక్షేమం కోసం వారికి రాజ్యాంగబద్ధమైన హక్కులను కల్పించడంలో అంబేద్కర్ కీలకపాత్ర పోషించారని, కార్మిక చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచారని ఆయన అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో జిల్లాలో మే 31 లోగా ప్రతి మండలంలో రెండు గ్రంథాలయ గదులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో దశలవారీగా ప్రతి గ్రామంలో గ్రంథాలయాల ఏర్పాటు దిశగా కృషి చేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. భూపాల పల్లి పట్టణంలో అంబేద్కర్ జంక్షన్ సుందరీకరణ పనులు, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి.రమేష్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుని ఆశయాల సాధన కోసం పేద ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తూ పటిష్ట చర్యలు తీసుకుందని , తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల కోసం సీఎం కేసీఆర్ వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసారని తెలిపారు. భూపాల పల్లి పట్టణంలోనే అంబేద్కర్ జంక్షన్ సుందరీకరణ పనులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని, స్థానికంగా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం రెండు కోట్ల నిధులు మంజూరు చేసిందని, త్వరలో టెండర్ ముగించి పనులు చేపడతామని ఆయన తెలిపారు. భూపాల పల్లి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు అవుతుందని, సీఎం కేసీఆర్ పిలుపుమేరకు గత సంవత్సరం ఎమ్మెల్యే సొంత ఖర్చులతో ట్రస్టు ద్వారా అందించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో 120 మంది యువకులు ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలకు ఎంపిక అయ్యారని తెలిపారు. ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని, నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిందని ఆయన తెలిపారు. ఢిల్లీలో నిర్మించిన పార్లమెంట్ భవనానికి సైతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరాణి సిద్దూ మాట్లాడుతూ ప్రభుత్వం మహనీయుల జయంతులను,అన్ని రకాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తుందని, మహనీయుల ఆశయాలను వారు చేసిన గొప్ప పనుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని నవ సమాజ నిర్మాణానికి పాటుపడాలని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా ,24 గంటల ఉచిత విద్యుత్ , రెసిడెన్షియల్ పాఠశాలలు, మన ఊరు -మన బడి వంటి అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని , వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసులు, జెడ్పి వైస్ చైర్ పర్సన్ కె.శోభ, వివిధ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు హాజరయ్యారు.
ప్రపంచ మేధావి బాబా సాహెబ్
RELATED ARTICLES
Recent Comments