టీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలి
మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం నర్సంపేట పట్టణంలోని జయముఖి కాలేజ్ సెమినార్ హాల్ లో బీజేపీ నర్సంపేట నియోజకవర్గ బూత్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతంపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై రేవూరి ప్రకాశ్ రెడ్డి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ లో సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన చేస్తున్నారని ఆరోపించారు. గత ఎనిమిదేళ్లుగగా ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్న తీరుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు ఒకే ఎజెండాతో పోతున్నాయని, ఇది దుర్మార్గమైన పరిస్థితి ఆన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజా స్వామిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ ఉద్యమిస్తుందన్నారు. బీజేపీ కుల, మత వర్గ పరంగానో ఏర్పడిన పార్టీ కాదని, కుటుంబ పార్టీ అసలే కాదని, ప్రజల పార్టీ అని, భారతదేశం సమగ్రత, అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడిందన్నారు. గత రెండు ఎన్నికల్లో మోసపోయామని రాష్ట్ర ప్రజలకు అర్థం అయిందని, ఇవాళ ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా, ఎన్ని రకాలుగా మభ్య పెట్టాలని చూసినా వారిని విస్మరిస్తారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ రాష్ట్రంలో, కేంద్రంలోనూ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశం ద్వారా తాను నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా గతంలో కృషి చేశానని, ప్రజల రుణం తీర్చుకోవడానికి ఏ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకొని ముందుకు సాగుతానన్నారు. నియోజకవర్గంలో కొందరు ప్రజల్లో అయోమయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీ పట్ల తప్పుడు ఆరోపణలు చేస్తూ వ్యతిరేకత పెంచే కుట్ర చేస్తున్నారన్నారు. వాటిని తిప్పి కొడుతూ ఇప్పటినుంచే బూత్ స్థాయి నుంచి నాయకులు సమిష్టిగా ఉండి రాబోయే ఎన్నికల్లో నర్సంపేట గడ్డపై బీజేపీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా కృషి చేయాలని రేవూరి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల నాయకులు కొత్త శ్రీనివాస్, చుక్క రమేష్, బాల్ని జగన్, నర్సింగరాములు, గడ్డం ఆంజనేయులు, రఫీబాబా తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
RELATED ARTICLES
Recent Comments